logo

కేయూ ప్రతిష్ఠకు మరకలు

కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్‌ ఎ ఫ్లస్‌  ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు

Published : 19 May 2024 04:39 IST

విద్యానగర్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్‌ ఎ ఫ్లస్‌  ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు. ఇప్పుడు ఉప కులపతి తాటికొండ రమేశ్‌పై వచ్చిన పలు ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించడంతో విశ్వవిద్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక వీసీపై ఇలా విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. 

ఆరోపణలు ఇవీ..

న్యాక్‌ గ్రేడింగ్‌ కోసం చేపట్టిన ప్రాజెక్టులు నకిలీవని, ఆ సందర్భంగా చేపట్టి అభివృద్ధి పనుల్లో రూ.కోట్లు చేతులు మారాయని వీసీపై ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారని కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకుల సంఘం (అకుట్‌) ఆరోపించింది. ఈ నెల 21తో వీసీ రమేశ్‌ పదవీ కాలం ముగియనుంది. ఈ సమయంలో ఇష్టానుసారంగా కొత్తవారిని పరిపాలనా పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంపై ఫిర్యాదులు అందాయి. గతేడాది చేపట్టిన పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరిగాయని పరిశోధక విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అన్యాయం జరిగిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్వయంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలను వీసీ పెడచెవిన పెట్టారు. న్యాయ పరమైన అంశాలు పాటించకుండా అధ్యాపకులను తొలగించడం, ఇష్టానుసారంగా బదిలీలు, నియామకాలు, నకిలీ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం తదితర వాటిపై కేయూ అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆచార్య ఇస్తారి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. 

విచారణను స్వాగతిస్తున్నా..

రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం తనపై విజిలెన్స్‌ విచారణకు ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు వీసీ టి.రమేశ్‌ పేర్కొన్నారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని