logo

ప్రేమేందర్‌రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం

సుదీర్ఘకాలం  భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు

Published : 19 May 2024 04:45 IST

కేజీ-పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి,  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి. చిత్రంలో ఎడమ నుంచి కుడికి వరుసగా వరంగల్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు గంటా రవికుమార్,  మాజీ ఎమ్మెల్సీ జనార్దన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్‌ మార్తినేని ధర్మారావు ,మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు, వరంగల్‌ లోక్‌సభ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్, హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, మహబూబాబాద్‌ లోక్‌సభ పార్టీ అభ్యర్థి  సీతారాం నాయక్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు. 

సుబేదారి, న్యూస్‌టుడే: సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో లక్ష పైచిలుకు ఓట్లు ఉన్నాయన్నారు. వీటిలో అత్యధికంగా భాజపా బలపర్చిన అభ్యర్థికి వచ్చే విధంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున ప్రణాళికలను తయారు చేసుకొని పనిచేయాలన్నారు. వరంగల్‌ నగరాభివృద్ధికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం కేంద్రం ఉపకార వేతనాలు ఇస్తే అప్పటి భారాస ప్రభుత్వం నిధులను మళ్లించిందని ఆరోపించారు. శాసన మండలిలో ప్రశ్నించే వారిని ఎన్నుకోవాలన్నారు. ప్రేమేందర్‌రెడ్డి గెలుపుతో ఓరుగల్లు ప్రగతికి బాటలు పడతాయన్నారు.  మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి భాజపాలో పనిచేస్తున్నారన్నారు. పార్టీలు మారని అభ్యర్థి అని పేర్కొన్నారు. ఆయన్ను బలపరిస్తే నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తారన్నారు. సమావేశంలో వివిధ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు బుచ్చిబాబు, అశోక్‌బాబు, సత్యనారాయణరెడ్డి, శివకుమార్, భూపాల్‌రావు,  వివిధ మండలాలు, డివిజన్ల నుంచి వచ్చిన నాయకులు, కారకర్తలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని