logo

నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి

తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికే ఉందని పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

Published : 19 May 2024 04:49 IST

మడికొండ సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, చిత్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ తదితరులు 

మడికొండ, న్యూస్‌టుడే: తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికే ఉందని పార్టీ నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం కాజిపేట మండలం మడికొండలోని వేడుకల మందిరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుక పేరుతో భారీగా డబ్బులు సంపాదించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 56 కేసులు ఉన్నాయని ఆరోపించారు.  జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో గ్యారంటీల అమలు గురించి ఏనాడూ తన సామాజిక మాధ్యమంలో ప్రస్తావించని వ్యక్తి ప్రశ్నించే గొంతుక ఎలా అవుతారని  ప్రశ్నించారు. అభ్యర్థి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన తనను ఆశీర్వదిస్తే మీ హక్కుల సాధనకు పోరాడుతానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. సమకాలీన సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న రాకేశ్‌రెడ్డిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్, భారాస నాయకులు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజల గొంతుకను ఎమ్మెల్సీగా గెలిపించండి 

దామెర:   దామెరలో పరకాల నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తీన్మార్‌మల్లన్న బ్లాక్‌మెయిలర్‌ అన్నారు. ఒక్కనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత ఉద్యోగం వదిలి పుట్టినగడ్డకు సేవ చేసేందుకు వచ్చానన్నారు.  ఎమ్మెల్సీగా గెలిచినా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోనన్నారు. భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ పట్టభద్రులు గ్యారంటీల గారడీలో పడొద్దన్నారు.  భారాస వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ నిరుద్యోగులు ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు పట్టభద్రుల చేతుల్లో ఉందన్నారు.  సమావేశంలో కుడా మాజీ ఛైర్మన్‌ యాదవరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు ధర్మారావు, సుదర్శన్‌రెడ్డి, కల్పన, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని