logo

పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..

‘వరంగల్‌ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ అభ్యర్థికి విజయం దక్కలేదు.

Published : 19 May 2024 04:51 IST

మాట్లాడుతున్న తీన్మార్‌ మల్లన్న  

జనగామ, న్యూస్‌టుడే: ‘వరంగల్‌ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్‌ అభ్యర్థికి విజయం దక్కలేదు. నన్ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాకు, ప్రజాపాలన అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలి’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న కోరారు. పట్టభద్రులు తనకు వేసే ఓటును వృథా కానివ్వనని అన్నారు. శాసన మండలి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జనగామలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఆరేళ్ల కోసం పట్టభద్రులు ఓటు వేసి గెలిపిస్తే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మూడేళ్లకే దాన్ని ఎందుకు వదిలిపెట్టారో ప్రశ్నించాలన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 17 వేల బోగస్‌ ఓట్లను ఆయన నమోదు చేయించారని, ఆధారాలతో సహా తాము బయటపెట్టినా చర్యలు తీసుకోలేదన్నారు.  రానున్న కాలంలో కేసీఆర్‌తో పాటు పల్లా ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు.  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 35 వేల కొలువులు ఇచ్చారని, మల్లన్నను గెలిపిస్తే తాము యువతకు అండగా నిలుస్తామన్నారు.  తీన్మార్‌ మల్లన్న గెలుపునకు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కోరారు. నియోజకవర్గ కోఆర్డినేటర్‌ భవానిరెడ్డి, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, రాజమౌళి, జిల్లా మహిళ అధ్యక్షురాలు ఇందిర, పట్టణ అధ్యక్షురాలు జక్కుల అనిత, మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ కల్యాణి, గాదెపాక రాంచందర్, యూత్‌ జిల్లా అధ్యక్షుడు శివరాజ్‌యాదవ్, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్, పట్టణాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
భూపాలపల్లి:  తనను గెలిపిస్తే.. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో  స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ..  అత్యధిక మెజార్టీతో తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలని కోరారు. సమావేశంలో పీసీసీ సభ్యులు చల్లూరి మధు, విజయ్‌కుమార్, జిల్లా నాయకులు గండ్ర సత్తిరెడ్డి, బుర్ర కొంరయ్య, దేవన్, రాజేందర్, కరుణాకర్, జోగ బుచ్చయ్య, కౌటం రవి, జంపయ్య, రమేష్, ముంజాల రవీందర్, సాంబమూర్తి, బందు సాయిలు తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు