logo

మోడికుంట.. కాలయాపన ఎందుకంట?

సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.

Published : 20 May 2024 02:29 IST

ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం 

న్యూస్‌టుడే, వాజేడు: సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ప్రాజెక్టు అంచనా వ్యయం అంతకంతకు పెరుగుతోంది. తట్టెడు మట్టి తీయకుండానే 18 ఏళ్ల క్రితమే రూ.58.42 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. నిధుల మంజూరు చేయడంలో కాలయాపన చేస్తుండటంతో ప్రాజెక్టు వ్యయం నాలుగైదు రెట్లు పెరిగింది. 

వాజేడు మండలంలోని 35 గ్రామాల్లోని బంజరు భూములను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు మంజూరైంది.2005లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.124.60 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిచ్చింది. ముంబయికి చెందిన గామన్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ రూ.118.95 కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తట్టెడు మట్టి తీయకుండానే  సర్వే పనులకు, మొబిలైజేషన్‌ అడ్వాన్సు, భూసేకరణకు, అటవీశాఖ అనుమతుల పేరుతో రూ.58.42 కోట్లను వెచ్చించిన ప్రభుత్వం పనులను మాత్రం చేపట్టలేదు. ఇప్పటికి 18 సంవత్సరాలు గడుస్తున్నా పాలకులకు పట్టింపు లేకపోతోంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ప్రస్తుతం నాలుగున్నర రెట్లు పెరిగి రూ.527 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పడిన తరువాతైనా పనులు పరుగులు పెడతాయనుకున్న రైతుల ఆశలు అడియాసలుగానే మిగిలాయి.

18 ఏళ్లుగా నిరీక్షణ 

ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో 2005 మే 25న రూ.124.60 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.  ఈపీసీ పద్ధతిలో ప్రభుత్వం టెండరు పిలిచింది. ప్రాజెక్టు నిర్మాణ పనులను ముంబయికి చెందిన గామన్‌ ఇండియా సంస్థ దక్కించుకుంది. అదే ఏడాది జులై 18న రూ.118.95 కోట్లతో నిర్మిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కదుర్చుకుంది. ప్రభుత్వం విధించిన గడువు మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006 జులై 18న ప్రారంభించి 2008 జులై 17 నాటికి పూర్తిచేయాల్సి ఉంది. సిబ్బంది ఉండేందుకు నివాసాలు, క్రషర్‌ నిర్మించారు. ఇసుక సేకరణ జరిగినప్పటికీ అనుమతుల మంజూరులో ఏర్పడిన జాప్యంతో ఖనిజాభివృద్ధి సంస్థ తరలించుకుపోయింది. ఆ తరువాత గుత్తేదారుతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దయింది.

అనుమతులు, అభిప్రాయ సేకరణతో గడుస్తున్న కాలం: ప్రాజెక్టు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు, నిధుల చెల్లింపుల పేరుతో కాలం గడుపుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన భూసేకరణ జరిగినా పనులు చేపట్టడం లేదు. సాగునీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు సాధారణంగా అటవీ భూముల సేకరణతోనే ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ ప్రాజెక్టుకు అటవీశాఖ నుంచి  1232 ఎకరాల భూమికి అనుమతులు వచ్చాయి. ఇందుకు  సుమారు రూ.60 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2018 సెప్టెంబరు 29న అప్పటి జిల్లా కలెక్టరు వాసం వెంకటేశ్వర్లు  రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయినందున ప్రాజెక్టు పనులు చేపడతారని బంజరు భూములకు సాగునీటి సౌకర్యం ఏర్పడుతుందని ఆశపడిన రైతులకు ఆరేళ్లుగా నిరాశే మిగిలింది.

గుత్తేదారు రద్దు: ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని నీటి పారుదల శాఖ అధికారులు పలుమార్లు గామన్‌ ఇండియా లిమిటెడ్‌కు నోటీసులు పంపినా ప్రయోజనం లేకపోయింది. గుత్తేదారును రద్దు చేయాలని, నాలుగున్నర రెట్ల పెంపుతో సవరించిన అంచనా వ్యయం రూ.526 కోట్లకు అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ అనుమతుల కోసం ఈప్రాంత రైతులు ఎదురుచూస్తున్నారు.

సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయి..

వలీం, జేఈ, మోడికుంట ప్రాజెక్టు

కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు వచ్చాయి. ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన కేంద్రం నుంచి రావలసిన అనుమతులన్నీ రావడంతో అడ్డంకులు తొలగిపోయాయి. అటవీ శాఖకు రూ.60కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎన్నికల తరువాత టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని