logo

వరి వైపే మొగ్గు

జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు.

Published : 20 May 2024 02:34 IST

జిల్లాలో వానాకాలం సాగు అంచనా ఖరారు

పత్తి అచ్చు తీస్తున్న రైతు (పాతచిత్రం) 

నెహ్రూసెంటర్, న్యూస్‌టుడే: జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. ఆ తర్వాత పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు సాగవుతాయని అధికారులు ఇచ్చిన గణాంకాలు చెబుతున్నాయి. వీటితో నూనె గింజల పంటలతో పాటు అపరాలు కూడా సాగవుతాయి. గత ఏడాది వానాకాలంలో 4,29,790 ఎకరాల్లో పంటలు సాగవుతాయని ప్రణాళిక రూపొందించిన అధికారులు ఈసారి దానికంటే 731 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం నుంచి ధాన్యానికి బోనస్‌గా రూ. 500లు ఇస్తామని ప్రకటించడం, ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతుండడంతో వ్యవసాయశాఖ అంచనాలకు మించి వరిసాగయ్యే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని భావిస్తున్నారు.

సాగు అంచనాలను సిద్ధం చేసిన అధికారులు ఆ పంటలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు అవసరతను కూడా నిర్ధారించారు. 62,574.94 క్వింటాళ్ల వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, మినుములు, పెసర, కందులు, మిరుప విత్తనాలు, 1,13,719.43 టన్నుల ఎరువులు అవసరమని పేర్కొన్నారు.

పప్పు దినుసుల పంటపై చిన్నచూపేనా ?

ఏటా పప్పు దినుసుల పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. రైతులు వాటి సాగుపై చిన్నచూపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. వాటి కొరత ఉన్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో పప్పులకు డిమాండ్‌ పెరుగుతోంది. అన్నదాతలు సాగును పెంచేలా.. వాటి విలువపై సంబంధిత అధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నూనె గింజల పంటల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని