logo

కిసాన్‌ నిధి.. కొందరికేనా?

రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించారు.

Published : 20 May 2024 02:36 IST

న్యూస్‌టుడే, భూపాలపల్లి కలెక్టరేట్‌: రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ప్రారంభించారు. పథకం ప్రారంభం నాటికి పట్టా పాసు పుస్తకాలు పొందిన రైతులను మాత్రమే అర్హులుగా గుర్తించి పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. 5 ఏళ్లు  గడుస్తున్నా నూతన రైతులకు పథకంలో అవకాశం ఇవ్వక పోవడంతో అన్నదాతలకు నిరీక్షణ తప్పడం లేదు. 

ఏటా తగ్గుతున్న లబ్ధిదారులు..

జిల్లా వ్యాప్తంగా 53 వేలకు పైగా లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఒక్కో విడతకు రూ.2 వేల చొప్పున వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతూ వస్తోంది. రైతులు మరణించడం, ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు, ఐటీ రిటర్న్స్‌ కడుతున్న వారు ఇలా వారిని గుర్తించి తొలగించడంతో క్రమంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. అలాగే ఈకేవైసీ నమోదు చేసుకొని వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో నూతనంగా అన్నదాతలను పథకంలో లబ్ధిదారులుగా చేర్చకపోవడంతో అర్హులైన ఎంతో మంది రైతులకు ఎదురు చూపు తప్పడం లేదు. పెట్టుబడి సాయంతో కొంత ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని ఇప్పటికైనా నూతనంగా అర్హులైన రైతులను పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో లబ్ధిదారులుగా చేయాలని రైతులు కోరుతున్నారు. 

వేల సంఖ్యలో అర్హులు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రైతుబంధు పొందుతున్న అన్నదాతలు 1.21 లక్షల మంది ఉన్నారు. పీఎం కిసాన్‌ పథకంలో 16వ విడతలో 32 వేల మంది మాత్రమే అర్హులుగా కొనసాగుతున్నారు. ఈ పథకం కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పటి వరకు సుమారు 18 నుంచి 20 వేలకు పైగా రైతులు ఈ పథకంలో  అర్హులుగా ఉంటారు. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే పథకంలో లబ్ధిపొందే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు ఈకేవైసీ నమోదుపై అవగాహన కల్పించాలి. 

మార్గదర్శకాలు రావాలి 

విజయ్‌ భాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి సంబంధించి నూతనంగా అన్నదాతలకు అవకాశం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాలి. వస్తే అర్హులైన వారు మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో అర్హులైన రైతులు సుమారు 18 వేలకు పైగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈకేవైసీ ఇంకా 486 మంది చేసుకోవాల్సి ఉంది. ఈకేవైసీ చేసుకుంటే ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు