logo

భారాస గెలుపునకు కృషి చేయాలి..

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 20 May 2024 02:39 IST

మాట్లాడుతున్న మాజీమంత్రి దయాకర్‌రావు

తొర్రూరు, న్యూస్‌టుడే: ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని వెలికట్ట గ్రామశివారులోని ఓ వేడుకల మందిరంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న తీన్మార్‌ మల్లన్న ఓ బ్లాక్‌ మెయిలర్‌ అని ధ్వజమెత్తారు. అతణ్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో భాజపాకు స్థానం లేదన్నారు. గత భారాస ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. గులాబీ పార్టీపై ఇతర పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను సోషల్‌ మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. కార్యకర్తలు గ్రామ స్థాయిలో తిరిగి యువతకు భారాస చేసిన మేలుని వివరించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జడ్పీటీసీ సభ్యుడు మంగళంపల్లి శ్రీనివాస్, నాయకులు గాంధీనాయక్, సోమేశ్వరరావు, ఆయా మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం తగదు..

పాలకుర్తి, న్యూస్‌టుడే: కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం క్రయవిక్రయాలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని విస్నూరు, తొర్రూరు గ్రామాల్లో తడిసిన ధాన్యం రాశులను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. జిల్లాలో కోతలు ముగిసి 3 మాసాలు గడుస్తున్నా.. కొనుగోళ్లు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి, ఆనక అన్నదాతలను నిండా ముంచిందని దుయ్యబట్టారు. క్రయవిక్రయాలను వేగవంతం చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని