logo

వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్‌!

పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. 

Published : 20 May 2024 02:42 IST

ఏళ్లతరబడి సమస్యకు పరిష్కారం

వడపోసేందుకు ఏర్పాటు చేసిన యంత్ర సముదాయం.. 

పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. 

న్యూస్‌టుడే, జనగామ: పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున రోజువారిగా పోగయ్యే చెత్త నిర్వహణ పురపాలికలకు భారంగా మారుతోంది. వ్యర్థాల నిర్వహణ సజావుగా లేదని, జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) జరిమానా విధించిన సంగతి తెల్సిందే. ఈ సమస్య పరిష్కారానికి బయోమైనింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని 130 పురపాలికలను 9 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్లో 11 నుంచి 20 పురపాలికలను చేర్చారు. ఇందులో ఒకటో క్లస్టర్లో జనగామ, భూపాలపల్లి పురపాలిక సహా 13 పురపాలికలకు చోటు లభించింది. 

10 ఎకరాల్లో డంపింగ్‌యార్డు

70 ఏళ్ల చరిత్ర కలిగిన జనగామ పురపాలికకు 15 ఏళ్ల క్రితం వరకు డంపు యార్డు లేదు. తొలుత చంపక్‌హిల్స్‌లో 5 ఎకరాలు కేటాయించారు. పక్కాయార్డు లేక చెత్త ప్రధాన రహదారి దాకా వచ్చింది. సమీపంలోనే ఎంసీహెచ్‌ వైద్యాలయం నిర్మించారు. వ్యర్థాల నిర్వహణ లోపంతో అందాల చంపక్‌హిల్స్‌ దుర్వాసనకు కేంద్రమైంది. దీంతో మరికొంత దూరంలో 10 ఎకరాలు కేటాయించారు. దశల వారీగా యార్డు ఓ రూపాన్ని సంతరించుకుంది. పదేళ్లపాటు సేకరించిన ఘన వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలకు నిప్పంటించడంతో ఆసుపత్రికి, దుర్వాసన, పొగ సమస్య తీవ్రమైంది. అక్కడే తాత్కాలిక వైద్య కళాశాల ఏర్పాటైంది. ఈ పరిస్థితుల్లో బయోమైనింగ్‌ పథకం మంజూరైంది. సాగర్‌మోటర్స్‌ అనే సంస్థకు పని అప్పగించారు. యంత్రాల సాయంతో 8 వేల టన్నుల వ్యర్థాలను వడపోశారు. ఈ ప్రక్రియలో వేరుపడిన ఎరువు నాణ్యతను పరిశీలించాల్సి ఉందంటున్నారు. మరి కొద్ది రోజుల్లో బయోమైనింగ్‌ ప్రక్రియ పూర్తి కానుంది.

  • పట్టణంతో పాటు.. మరో నాలుగు గ్రామాల చెత్త: 30 వార్డులున్న జనగామ పట్టణంలో రోజు సుమారు 20 టన్నుల ఘన వ్యర్థాలను సేకరించి యార్డుకు తరలిస్తున్నారు. సమీపంలోని మరో నాలుగు గ్రామాల్లో సేకరించే చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. గతంలో కేటాయించిన ఐదెకరాల్లో పేరుకపోయిన చెత్తను సైతం బయోమైనింగ్‌ విధానంలో శుద్ధి చేస్తే మేలు జరుగుతుంది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ అర్బన్‌ 2.0లో భాగంగా పురపాలికల్లో జీరో డంపింగ్‌ స్థలాల సాధనే లక్ష్యంగా బయోమైనింగ్‌ విధానం అమల్లోకి వచ్చింది. యార్డును చెత్తకుప్పగా కాకుండా ఇళ్ల వద్దనే తడి, పొడి చెత్తను, ప్రమాదకర వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణను అమలు చేయాల్సి ఉంది.

పర్యావరణానికి మేలు

వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్, జనగామ

 మూడేళ్ల క్రితం ఈ ప్రతిపాదన కార్యరూపం ధరించింది. లక్ష్యానికి అనుగుణంగా బయోమైనింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ఏళ్ల తరబడి పేరుకున్న ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలను వడపోసే పథకం మంజూరు కావడం ఈ ప్రాంత పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. వడపోతలో వచ్చిన సేంద్రియ ఎరువు నాణ్యతను అనుసరించి వినియోగించేలా చూస్తాము.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని