logo

అతివలకు ఉపాధి వెలుగులు

విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.

Published : 20 May 2024 02:51 IST

సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి : విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే, స్థల సేకరణే ప్రధాన అంశం.. ప్యానళ్లను పరిచేందుకు స్థలం అవసరం ఉంటుంది. జిల్లాల్లో భూసేకరణ కోసం స్థలాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. విద్యుత్తు ఉప కేంద్రాల ఆవరణలో, వాటికి 2 కిలోమీటర్ల దూరం మించకుండా స్థలాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. ఒక మెగావాట్ యూనిట్‌ ఉత్పత్తి చేపట్టేందుకు వీలుగా ఒక్కో ప్లాంట్‌ నాలుగెకరాల విస్తీర్ణంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, టేకుమట్ల, మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో 4 ఎకరాల చొప్పున చిట్యాలలో 8 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. వాటిని విద్యుత్తు శాఖ అధికారులు పరిశీలించి ఆ ప్రాంతాలు ప్లాంటు ఏర్పాటుకు అనువుగా ఉన్నాయా లేదా అధ్యయనం చేస్తారు. విద్యుత్తు అధికారులు స్థలాలు అనువుగా ఉన్నట్లు నిర్ధారిస్తే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు.

నిర్వహణ పొదుపు సంఘాలకు 

సౌర విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసి వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా పొదుపు సంఘాలకు అప్పగించే అవకాశం ఉంది. నిర్వహణపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బాధ్యతలను అప్పగించాలని యోచిస్తున్నారు. రూ.4.25 కోట్ల వ్యయంతో ఒక్కో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. సోలార్‌ ప్లాంట్లలో ఉత్పత్తయిన విద్యుత్తును సమీపంలోని 33/11 కేవీ ఉపకేంద్రాల ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. సోలార్‌ విద్యుత్తు విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ద్వారా మహిళా సంఘాలకు ఉపాధి కలగనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్థలాల సేకరణ చేపడుతున్నారు. టీఎస్‌ రెడ్కో, విద్యుత్తు, డీఆర్డీఏ సమన్వయంతో ప్లాంట్లు రూపుదిద్దుకోనున్నాయి. త్వరలోనే ప్లాంట్ల ఏర్పాటుపై ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించనుంది. 

ఎన్నో ప్రయోజనాలు..

థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గును మండించడంతో కర్బన ఉద్గారాలు వెలువడి గాలిలో కలిసి ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సౌర విద్యుత్తుతో కాలుష్యానికి చెక్‌ పెట్టవచ్చు. కాలుష్య నివారణతో పర్యావరణాన్ని కాపాడవచ్చు. బొగ్గు, నీటి వినియోగం తగ్గుతుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు కేటీపీపీలో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తికి రోజుకు కనీసం 14 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. నీరు, బొగ్గు తరలించే వ్యయం భారీగా ఉంటుంది. సౌర విద్యుత్తు ద్వారా ఆ వ్యయం ఆదా అవుతుంది. స్థానికంగా మహిళలకు, యువతకు ఉపాధి కలగనుంది. మహిళలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు, స్థానికంగా విద్యుత్తు ఉత్పత్తి కావడంతో విద్యుత్తు సమస్యలకూ చెక్‌ పెట్టవచ్చు. ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఇలాంటి పథకాలకు భారం పడకుండా ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు