logo

బాల చోదకులు.. ప్రమాద కారకులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు.

Updated : 20 May 2024 04:16 IST

నలుగురు స్నేహితుల దుర్మరణం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. తెలిసి తెలియని వయసులో సరదాగా రోడ్లపైకి వస్తూ.. వేగాన్ని అదుపు చేయలేక అసువులుబాస్తున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. పిల్లలకు వాహనాలు ఇస్తే.. పెద్దలకు సైతం శిక్ష పడుతుందని తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: గత నెలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నలుగురు స్నేహితులు ఒకే ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ.. మలుపు వద్ద అదుపుతప్పి ఎదురుగా వచ్చిన బస్సును ఢీకొట్టారు. వర్ధన్నపేట ఠాణా పరిధిలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించారు. వారు నలుగురూ మైనర్లే. ఇలా నిత్యం ఎక్కడో ఒకచోట పిల్లలు ప్రమాదంబారిన పడుతున్నారు. కొందరు తీవ్రంగా గాయపడి వికలాంగులుగా మారుతున్నారు.

లైకుల కోసం సర్కస్‌ ఫీట్లు..

న్యూస్‌టుడే, ఖిలావరంగల్‌ : సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం బైకులతో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ వీడియో రికార్డు చేసుకుంటున్నారు. అనంతరం వాటిని వివిధ మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీరి చేష్టలతో మిగతా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఖిలావరంగల్‌కోట ప్రధాన దారిలో కనిపించిన దృశ్యం ఇది. నిత్యం పర్యాటకుల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్లపై ఇలా చేయడం చాలా ప్రమాదకరం.

మోటారు వాహనాల చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు దాటినవారు మాత్రమే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను నడిపేందుకు అర్హులు. కానీ! పది, ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు వాహనాలను నడుపుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనల్‌ హోంకు తరలిస్తున్నారు. 

తల్లిదండ్రులూ ఆలోచించాల్సిందే..

తమ పిల్లలు చిన్న వయసులోనే వాహనం నడుపుతున్నారని ఉప్పొంగిపోయే తల్లిదండ్రులు.. డ్రైవింగ్‌లో వారికున్న అవగాహన ఎంత..? మన సమక్షంలో.. మనంలేని సమయంలో ఎలా నడిపిస్తున్నాడు..? అనే విషయాలను గమనించాలి. వారి వయసుకు పరిమితి విచక్షణ ఉంటుంది. రోడ్డుపై దూసుకెళ్లడం తప్ప ప్రమాదాలకు గురైతే ఏంటి పరిస్థితి? అనే ఆలోచన ఉండదు.

  • ఈ ఏడాది పోలీసు తనిఖీల్లో పట్టుబడిన వారిలో 409 కేసుల్లో 172 మంది బాలలకు ఒక్కరోజు జువైనల్‌ హోం  శిక్షలు పడ్డాయి.

10 రకాల కేసుల నమోదుకు అవకాశం

వాహనం నడిపే పిల్లలపై పోలీసులు పదిరకాలైన కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంది. లైసెన్సు లేకుండా నడపడం, అతివేగం, శబ్ద కాలుష్యం, నంబరు ప్లేటులో లోపాలు, మత్తు పదార్థాలు దొరికితే.. ఇలా వివిధ కారణాలతో బండి నడిపిన వ్యక్తితో పాటు యజమానిపై కేసులు నమోదు చేయవచ్చు. అలా చేస్తే పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతో చాలా సందర్భాల్లో పోలీసులు హెచ్చరిస్తూ వదిలేస్తుంటారు. కానీ! పిల్లలు రోడ్డు నిబంధనలను తేలిగ్గా తీసుకుంటున్నారు. 

  • రవాణాశాఖ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తే వాహనదారులకు రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఇక మోటారు వాహన చట్టం పోలీసుశాఖ ఐపీసీ(న్యాయసంహిత) సెక్షన్ల కింద శిక్షార్హులు. వీటి ఆధారంగా చూస్తే కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని పిల్లలకు వాహనాలు ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు జాగ్రత్తపడాలి.

పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు

ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ 

 తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దు. డ్రైవింగ్‌ లైసెన్సు తీసుకున్న తర్వాత ట్రాఫిక్‌ నియమాలు తెలిసిన వారికి మాత్రమే కారు లేదా బైకు ఇవ్వాలి. తల్లిదండ్రుల గారాబం వల్ల పిల్లలు ప్రమాదంలో చిక్కుకుంటున్న ఘటనలే ఎక్కువ. బాలలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వరు. 18 ఏళ్లలోపు వారు వాహనాలు నడిపిన సమయంలో ప్రమాదానికి గురైతే యజమానిపై కేసు నమోదు చేస్తారు. పిల్లలు వాహనాన్ని నడిపేటప్పుడు ప్రమాదం జరిగితే బీమా వర్తించదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని