logo

ఆడిట్‌ విభాగంలో లెక్కలేనితనం

గతేడాది సీనియర్‌ అసిస్టెంట్‌ బండా అన్వేష్‌ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు.

Published : 20 May 2024 02:58 IST

పరిశీలన చేయకుండానే ఎంబీలపై సంతకాలు

రంగంపేట, న్యూస్‌టుడే:  గతేడాది సీనియర్‌ అసిస్టెంట్‌ బండా అన్వేష్‌ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. ఇద్దరు, ముగ్గురు జైలుకెళ్లి వచ్చినా.. గ్రేటర్‌ వరంగల్‌ ఆడిట్‌ విభాగం తీరు మారడం లేదు. పర్సంటేజీలు ఇస్తామంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఎంబీలు, ఇతర చెల్లింపుల దస్త్రాలపై సంతకాలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల ఎంబీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలు ఆగడం లేదు. తాజాగా పాత తేదీలతో బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి ఎంబీ పుస్తకాలపై సంతకాలు చేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన ఆడిట్‌ విభాగం ప్రేక్షకపాత్ర వహిస్తుంది. పాత తేదీలతో ఎంబీ పుస్తకాలు వస్తే, వీటిపై వెంటనే అభ్యంతరాలు చెప్పి, కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. ఆడిట్‌ విభాగం అడగక పోవడంతో చకాచకా ఎంబీలు గణాంక విభాగానికి చేరుకున్నాయి. కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే గుర్తించేంత వరకు ఆడిట్, గణాంక విభాగాలు నిద్రావస్థలో ఉన్నాయి.

తెరవెనుక ఇంజినీర్లు, గుత్తేదారులు

బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో ఎంబీ పుస్తకాలపై సంతకాలు చేయించడంలో బల్దియాకు చెందిన ఇంజినీర్లు, సివిల్‌ గుత్తేదారులు ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తోంది. కమిషనర్‌ పేషిలో పనిచేసే ఉద్యోగులు మధ్యవర్తులుగా వ్యవహరించారని సమాచారం. ఒకేసారి కాకుండా దశల వారీగా సంతకాలు చేయించినట్లు తెలిసింది. కొందరు ఏఈలు, డీఈలు స్వయంగా వెళ్లినట్లుగా సమాచారం. కాశీబుగ్గ, కాజీపేట, నక్కలగుట్ట డ్రాయింగ్‌ బ్రాంచి(డీబీ) విభాగం ఉద్యోగులు, ఆడిట్‌ విభాగం ఉద్యోగులు సహకారం అందించారని తెలిసింది. ఇప్పటికే ముగ్గురు ఉద్యోగులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. వీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

నిబంధనల ఉల్లంఘన

నిబంధనల ప్రకారమైతే అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులపై ఆడిట్‌ విభాగం డేగ కన్ను వేయాలి. పర్సంటేజీలకు ఆశపడి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇంజినీరింగ్‌ విభాగం నుంచి వచ్చే ఎంబీ పుస్తకాలను ఆడిట్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. అభివృద్ధి పని ఎక్కడ జరిగింది. ఏం పని, నిధుల కేటాయింపు, సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులు, క్షేత్రస్థాయిలో జరిగిన అభివృద్ధి పని విలువ ఎంత, వర్క్‌ ఇన్‌స్పెక్టర్, ఏఈ, డీఈలు చేసిన ఎంబీ రికార్డు తేదీ, ఈఈ, ఎస్‌ఈల సంతకాలు, క్వాలిటీ కంట్రోల్‌ కమిటీ సర్టిఫికెట్లు తదితరములు చూడాలి. అభివృద్ధి పని ఎప్పుడు జరిగింది, ఎంబీ పుస్తకంలో నమోదు, కమిషనర్‌ సంతకాలు చూడాలి. ఇలాంటివేమీ పరిశీలించడం లేదు. పర్సంటేజీలు తీసుకొని గుత్తేదారులు తీసుకొస్తున్న ఎంబీలపై సంతకాలు చేస్తున్నారని తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని