logo

కొలువు కల్ల.. జేబు గుల్ల!

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు.

Updated : 20 May 2024 04:17 IST

ఉద్యోగాల పేరిట  నిరుద్యోగులకు వల

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. ఉద్యోగ హోదాను బట్టి కొంత ధర నిర్ణయిస్తూ బేరమాడుతున్నారు. నిరుద్యోగులు సైతం వారి మాటలకు ఆకర్షితులై ఎలాంటి కష్టం.. పరీక్ష లేకుండా ఉద్యోగంలో చేరవచ్చని భావించి అప్పులు చేసి మరీ డబ్బులు అప్పగిస్తున్నారు. చివరకు చేతికి ఉద్యోగ లేఖ అందక.. దళారీ జాడ తెలియక మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏటా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రానున్నది ఉద్యోగ పరీక్షల కాలం కావడంతో నిరుద్యోగులు మోసానికి గుర   వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం...  

ఈనాడు, మహబూబాబాద్‌-న్యూస్‌టుడే, వరంగల్‌ క్రైం

తక్కువ సమయంలో.. ఎక్కువ డబ్బే లక్ష్యంగా

ఎప్పటికీ చేతి నిండా డబ్బులు కనిపించాలనే దురాశతో కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాఫియాకు తెర లేపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్యశాఖ, విద్యుత్తు, విద్యా శాఖల్లోని ఖాళీల ఉద్యోగ స్థాయి నుంచి వివిధ శాఖల్లోని అటెండర్‌ ఉద్యోగం వరకు ఇప్పిస్తామంటూ మాయమాటలతో నిరుద్యోగులను నమ్మించే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అందుకు వారు అధికారుల అవతారమెత్తుతారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు చూపిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నట్లు నమ్మిస్తున్నారు. వారి మాటలకు ఆకర్షితులవుతున్న నిరుద్యోగులు రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు ముట్టజెప్పుతూ మోసపోతున్నారు. 

నాలుగేళ్లలో..

ఉద్యోగాల పేరిట జరిగిన మోసాలకు సంబంధించి వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 2020 నుంచి ఇప్పటి వరకు 157 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పోలీసులు దాదాపు 18 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా 2022లో 52 కేసులున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 2022 నుంచి ఇప్పటివరకు సుమారు 16 కేసులు నమోదయ్యాయి.

నిపుణులు ఏమంటున్నారంటే..

సర్కారీ కొలువులకు సంబంధించి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి దానికి నోటిఫికేషన్‌ వస్తుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తారు. రాత పరీక్ష సైతం పారదర్శకంగా జరుగుతుంది. ఒక వేళ అవుట్‌ సోర్సింగ్‌ అయితే.. ఏ డిపార్ట్‌మెంటు, అధికారిక ప్రకటన ఉందా.. స్వయంగా వెళ్లి అధికారులను కలిసి అర్హత ఉంటే దరఖాస్తు చేసుకోవాలి. దళారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అప్పుడు నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి. డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటే.. అనుమానించి సమీపంలోని పోలీసులను ఆశ్రయించాలి.

ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు

దేవేందర్‌ రెడ్డి, ఏసీపీ, హనుమకొండ

ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికీ ఊరికే రావు.. ప్రతి పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో పారదర్శకంగా జరుగుతుంది. కష్టపడి చదువుకుని, పరీక్షల్లో ప్రతిభ చూపితే తప్ప ఉద్యోగాలు రావు. ఇటీవల కొంత మంది దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుని మోసం చేస్తున్నారు. అలాంటి వారి మాటలను నమ్మొద్దు. మీకు అలాంటి వారిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించండి.

ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఘటనలు

  • మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిరుద్యోగి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్న దళారుల చేతుల్లో మోసానికి గురయ్యాడు. వారికి సుమారు రూ.10 లక్షల వరకు ఇచ్చినట్లు సమాచారం.. చివరకు ఉద్యోగం రాకపోవడంతో 2023లో పోలీసులను ఆశ్రయించాడు. ఇతనిలా ఆ ముఠా చేతిలో చాలా మంది మోసపోయినట్లు తెలిసింది. పోలీసులు ముఠాలోని కొంత మందికి నోటీసులు కూడా ఇచ్చారు.
  • వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక నిరుద్యోగిని గురుకుల కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి 2020లో నమ్మించాడు. మాటల్లో ముంచి రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. చివరకు ఆ నిరుద్యోగి రూ.4.30 లక్షలు అప్పజెప్పాడు. కానీ, ఉద్యోగం ఇప్పించలేదు. చివరకు మోసపోయానని గ్రహించి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు.
  • వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మిల్స్‌కాలనీ ఠాణా పరిధిలో ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సింగరేణి, గురుకుల సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఒక నిరుద్యోగి నుంచి 2021లో రూ.10 లక్షలు తీసుకున్నాడు. పలుమార్లు ఉద్యోగం ఇప్పించాలంటూ డిమాండ్‌ చేసినా ప్రయోజనం లేదు. మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగం ఇప్పించడంలో జాప్యం చేస్తుండటంతో అనుమానం వచ్చి ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని