logo

నగరం.. చినుకులకే వణుకుతోంది..!

‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ 

Published : 20 May 2024 03:08 IST

జలమయమవుతున్న రహదారులు.. నీటమునుగుతున్న కాలనీలు

వరంగల్‌ కాశీబుగ్గ మున్సిపల్‌ సర్కిల్‌ కార్యాలయం ముందు వరదనీరు

‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ 

కార్పొరేషన్, న్యూస్‌టుడే

హనుమకొండ కాకతీయ కాలనీ ఫేస్‌1 వద్ద..

చిన్నపాటి వర్షానికే ఓరుగల్లు నగరం చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు కాలనీలు నీటమునిగి రాత్రంతా జాగరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటీవల నాలాల పూడికతీత పనులు పైపైన చేపట్టడంతో వరదనీరు సాఫీగా బయటకెళ్లడం లేదు. ప్రజా రవాణాకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. వచ్చేది వర్షాకాలం.. పరిస్థితి ఇలాగే ఉంటే నగరవాసులకు తీవ్ర ఇక్కట్లు తప్పేలా లేవు. కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ త్రినగరాలకు ముంపు బెడద పొంచి ఉంది.

హనుమకొండ చౌరస్తాలో  

స్మార్ట్‌ రోడ్లతోనే సమస్య..

  • వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 15 ప్రధాన రోడ్లను స్మార్ట్‌ రోడ్లుగా అభివృద్ధి పరిచేందుకు ప్రతిపాదించారు. రెండు, మూడు రోడ్లు తప్ప మిగిలినవి అసంపూర్తిగా వదిలేశారు. ప్రధాన రహదారుల్లో వర్షం నీరు నిలవడానికి స్మార్ట్‌ రోడ్లే కారణమని తేల్చారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు మధ్యలో ఆగాయి. ఇన్, అవుట్‌ లెట్లు లింకు చేయలేదు. కొన్నిచోట్ల పనులు ఆపేశారు.
  • హనుమకొండ పద్మాక్షిగుట్ట, కొత్త బస్టాండ్‌ రోడ్, కాపువాడ, మున్నూరు కాపువాడ రోడ్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో వర్షపు నీరు రోడ్లను ముంచెత్తుతోంది.
  • వరంగల్‌ ప్రాంతంలో ఎంజీఎం రోడ్, గోపాలస్వామి గుడి, పోచమ్మమైదాన్, తిలక్‌రోడ్, కాశీబుగ్గ, వరంగల్‌ స్టేషన్‌రోడ్, వరంగల్‌ చౌరస్తా, మేదరివాడ రహదారుల్లో డ్రైనేజీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరద నీరంతా నేరుగా వస్త్ర దుకాణాల్లోకి వెళ్లింది.

ఇదీ పరిస్థితి.. 

  • ప్రధాన, అంతర్గత రహదారుల్లోని మురుగు కాలువల్లో పెద్దఎత్తున వ్యర్థాలు పోగయ్యాయి. ప్రజారోగ్య విభాగం పైపైన పనులు చేసి వదిలేసింది. నగరంలోని 66 డివిజన్లలోని అంతర్గత డ్రైనేజీల్లో పూడికతీత పనులు పూర్తిగా చేయించాల్సిన అవసరం ఉంది.
  • వరంగల్‌ బట్టలబజారు, వేంకటేశ్వరస్వామి గుడి, పిన్నావారి వీధి, పాత బీటుబజారు, అండర్‌బ్రిడ్జి కింద వాన నీళ్లు ఆగాయి. హనుమకొండ అలంకార్‌ సెంటర్, హనుమకొండ చౌరస్తా, అదాలత్‌ సెంటర్, సుబేదారి సెంటర్లలో వరదనీరు నిలిచింది. దీంతో రవాణాకు ఆటంకô ఏర్పడింది.

నాలాలకు అడ్డంకులు

కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో 29 నాలాలు ఉన్నాయి. పూడికతీత పనుల కోసం రూ.79.81 లక్షలు కేటాయించారు. అత్యవసరం పేరుతో నామినేషన్‌పై కేటాయించారు. బల్దియా ఇంజినీర్ల పర్యవేక్షణ లేకపోవడంతో పైపైన పూడికతీత పనులు చేపట్టారు. కాలనీలు నీట మునగకుండా ఉండాలంటే నాలాలు శుభ్రం చేయాలి. వ్యర్థాలు ఉండొద్దు. ఈ విషయం తెలిసి కూడా ఇంజినీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

  • హనుమకొండ ప్రాంతంలో కీలకమైన నయీంనగర్‌ నాలా వద్ద కొత్తగా వంతెన కడుతున్నారు. దీనివల్ల ఈసారి కాలనీలకు ముంపు సమస్య ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందే.
  • వరంగల్‌ ప్రాంతంలో పోతననగర్‌ నాలా అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయి. స్మార్ట్‌సిటీ పనుల కోసం పోతననగర్‌ నాలాను మూసేశారు. నాలుగు రోజుల కిందట కురిసిన వర్షానికి రఘునాథ్‌ కాలనీ, బాబీ ఫంక్షన్‌ గల్లీ, పోతనరోడ్, రామన్నపేట బీసీ కాలనీలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.

నయీంనగర్‌ ‘నాలా’ ఎలా.?

హనుమకొండ ప్రాంతంలో కీలకమైన నయీం నగర్‌ ‘నాలా’ విస్తరణ, కొత్తగా వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. వచ్చేది వర్షాకాలం.. ఈలోపు పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ పెద్ద వడ్డేపల్లి, గోపాల్‌పూర్‌ చెరువులు అలుగు పోస్తే వరదనీరు కేయూసీ వంద అడుగులు, సమ్మయ్యనగర్, విద్యానగర్, నయీంనగర్, కిషన్‌పుర, పోచమ్మకుంట, భగత్‌సింగ్‌ నగర్‌ మీదుగా కెనాల్‌ టన్నెల్‌కు వెళ్తాయి. నయీంనగర్‌ ప్రధాన రహదారిలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా వర్షాలు పడితే వరదనీరు ఎలా మళ్లిస్తారనే దానిపై గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే పలు కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని