logo

వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు.

Updated : 20 May 2024 04:14 IST

భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం  

న్యూస్‌టుడే, భూపాలపల్లి : పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. పని ప్రదేశాల్లో ప్రధానంగా మహిళా ఉద్యోగినులపై వేధింపులు కొనసాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగినుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపాలిటీల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని గత ఏప్రిల్‌ 29న పురపాలిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో అధికారులు నిమగ్నమైనందున కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కమిటీలను ఏర్పాటు చేయడంపై భూపాలపల్లి, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్‌ కమిషనర్లు కసరత్తు చేస్తున్నారు. 

కమిటీల్లో ఎవరు ఉంటారంటే..

పురపాలికల్లోని మహిళా ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించేందుకు 2013లో జారీ చేసిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని, కమిటీల ఏర్పాటుకు పురపాలక శాఖ ఆదేశాలు చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో వివిధ హోదాల్లో మహిళా ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న అంతర్గత కమిటీలు రక్షణ కల్పించేందుకు కృషి చేయనున్నాయి. వేధింపులను అరికట్టేందుకు ఏర్పాటు చేసే కమిటీలో సీనియర్‌ మహిళా ఉద్యోగిని ప్రిసైడింగ్‌ అధికారిగా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏదైనా పురపాలికలో సీనియర్‌ మహిళా ఉద్యోగి లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఒక సీనియర్‌ మహిళా ఉద్యోగిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. మరో ఇద్దరిని ఈ కమిటీలో సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. మహిళా చట్టాలపై అవగాహన, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారికి సభ్యులుగా అవకాశమివ్వాలి. మహిళా సమస్యలపై పోరాటం చేసే ప్రభుత్వేతర మహిళ ఒకరికి కమిటీలో చోటు కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే ఈ కమిటీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక సమర్పించి వేధింపులకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేలా తోడ్పాటునందిస్తుంది. అంతర్గత కమిటీల ఏర్పాటుతో మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని విశ్వసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని