logo

చిట్టి చేతులతో 5 లక్షల విత్తన బంతులు

అది మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి చదివే పిల్లలు దాదాపు 300 మంది ఉంటారు.

Published : 25 May 2024 03:13 IST

పర్యావరణ పరిరక్షణకు వందేమాతరం ఫౌండేషన్‌ కృషి

 విత్తన బంతులు తయారు చేస్తున్న విద్యార్థులు

తొర్రూరు, న్యూస్‌టుడే: అది మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో వందేమాతరం ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి చదివే పిల్లలు దాదాపు 300 మంది ఉంటారు. జీవితానికి విద్య ఎంత అవసరమో.. వీరికి స్వచ్ఛమైన గాలినిచ్చే.. వర్షాలు కురిసేందుకు దోహదపడే మొక్కల పెంపకం కూడా అంతే ప్రధానమైందంటూ ప్రత్యేక పాఠాలు బోధిస్తున్నారు. మే 1 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ శిబిరంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ సంస్థ సహకారంతో ఆ చిన్నారులతో దాదాపు 5 లక్షల విత్తన బంతులను తయారు చేయిస్తున్నారు. తొలకరి వర్షాలు కురవడం ప్రారంభం కాగానే వీటిని ఆర్టీసీ ప్రయాణికులు, పల్లె ప్రకృతి వనాలకు అందజేస్తారు. దీంతో పాటు సాగునీటి కాలువలకు ఇరువైపులా నాటడం, వివిధ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాలకు వెళ్లి చల్లడం వంటివి విద్యార్థులే స్వయంగా చేస్తుంటారు. కురుస్తున్న వానలకు బంతిపై మట్టి తడిసి అందులోని గింజలు మొలకెత్తుతాయి. అవి పెరిగి భారీ వృక్షాలై ఆ ప్రాంతమంతా పచ్చదనం సంతరించుకుంటుంది. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు కూడా భాగస్వాములను చేస్తారు. గత పదేళ్లుగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

విద్యార్థులు తయారుచేసిన విత్తన బంతులు

విత్తనాలు ఇవే..: నల్లమల అటవీ ప్రాంతం నుంచి సేకరించిన 50 రకాల వృక్షజాతుల విత్తనాలతో బంతులను తయారు చేస్తున్నారు. మర్రి, రాగి, పగడ, మహాగని, వేప, నారవేప, నల్లమద్ది, విప్ప, చింత తదితర విత్తనాలు, చెరువులోని రేగడి మట్టి తెచ్చి అందులో కొంత ఆవుపేడను కలిపి విత్తన బంతులను తయారు చేస్తున్నారు. దీనికి ఆకర్షితులైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సైతం గతంలో ఇక్కడి నుంచి విత్తనబంతులను తీసుకెళ్లి హైదరాబాద్‌లోని ఓ రిజర్వ్‌డ్‌ ఫారెస్టు నిండా చల్లించారు. ఒకసారి చుక్కా రామయ్య కుటుంబ సభ్యులు బంతుల తయారీలో చేతులు కలిపి 1000 బంతులను తయారు చేశారు.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా బంతుల తయారీ ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నామని వందేమాతరం ఫౌండేషన్‌ డైరెక్టర్‌ టి.రవీంద్ర తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని