logo

బరువు పాఠం.. పిల్లలకు నేర్పిద్దాం

సెలవులు ముగింపు దశకు వచ్చాయి. వేసవి శిబిరాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఇళ్ల వద్దకు వెళ్లిన పిల్లలు తిరిగి వస్తున్నారు.

Updated : 25 May 2024 06:13 IST

సెలవుల చివరి రోజులు సద్వినియోగం చేసుకోవాలి

సెలవులు ముగింపు దశకు వచ్చాయి. వేసవి శిబిరాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఇళ్ల వద్దకు వెళ్లిన పిల్లలు తిరిగి వస్తున్నారు. విహారయాత్రలు సైతం ముగిసిపోయాయి. ఈ సెలవుల్లో ఇంటి వద్ద ఉండే పిల్లలకు చదువు వల్ల కలిగే శ్రమ ఉండదు.. పైగా ఇష్టమున్నది తినడం వల్ల అధిక బరువు పెరగడానికి అవకాశముంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి పిల్లలను టీవీ, చరవాణులకు దూరంగా ఉంచాలి. వారు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఈత నేర్చుకోవడం,  చిన్నచిన్న ఆటలు ఆడుకోవడం అలవాటు చేయాలి.

ఎంజీఎం ఆసుపత్రి, జనగామ టౌన్, న్యూస్‌టుడే

ఇదీ కారణం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నివారించదగిన 10 ఆరోగ్య సమస్యల్లో స్థూలకాయం ఒకటి. ఇది పెరిగిపోతుండటానికి టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడపటం, పిల్లలకు ఆటస్థలాలు కనుమరుగు అవుతుండటం, వ్యాయామం చేయకపోవడం, శారీరక శ్రమలేక, ఆహారంపై అవగాహన లేక చిరుతిళ్లకు అలవాటు పడటం వంటి జీవశైలి దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాధుల దాడి..

స్థూలకాయం కారణంగా గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, ఊపిరితిత్తుల జబ్బులు, పిత్తాశయంలో, కిడ్నీలో రాళ్లు, అల్సర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. భారీ కాయాన్ని మోయాల్సి రావడంతో మోకాలి కీళ్లు అరిగే ప్రమాదముంది. కాలేయం దెబ్బతింటుంది. ఇన్స్‌లిన్‌ రెసిప్టెన్స్‌ పెరుగుతుంది. దీంతో మధుమేహ నియంత్రణ కష్టమవుతుంది. ఇవి పక్షవాతానికి, గుండె జబ్బులకు దారితీస్తాయి.  లావు పెరిగేకొద్ది శారీరక, మానసిక రుగ్మతలు పెరుగుతాయి.

సర్వేలో ఆందోళనకరంగా..

పట్టణ ఉన్నత, మధ్యతరగతి మహిళల్లో 30-50 శాతం, పురుషుల్లో 32 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నట్లు ఇటీవల జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 18 ఏళ్లలోపు పిల్లల్లో 5 శాతం మంది ఊబకాయం, అధిక బరువుతో సతమతమవుతున్నట్లు వైద్యుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం.. 

 జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడు ఊబకాయంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. 20 కిలోలు అధిక  బరువుతో నడవడానికి, శ్వాస తీసుకోవడంలోనూ అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఈ వేసవిలో మితాహారం తీసుకోవడంతో పాటు రోజూ నడక అలవాటు చేసుకున్నారు. శాఖాహారానికి మారి ఒకే పూట ఆహారం, రాత్రిళ్లు పండ్లు తింటూ, బరువు సమస్యను అధిగమించారు. ప్రస్తుతం చలాకీగా మారారు.

మీకు తెలుసా..

  •  అధిక లావు ఉండటమే ఊబకాయమని పిలుస్తారు. అధిక బరువును బాడీ మాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) అనే గణాంక పద్ధతి ద్వారా ఎత్తు, బరువు ప్రకారం లెక్కిస్తారు. ఓ వ్యక్తి ఊబకాయం కలిగి ఉన్నాడనే నిర్ధారణ చేయడానికి ఉండాల్సిన బరువు కంటే 20 శాతం అధికంగా ఉంటే ఒబెసిటి కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు.
  • ఏ వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశముంటుంది. కొందరూ వంశపారంపర్యంగా ఈ సమస్య భారిన పడవచ్చు. తల్లిదండ్రుల్లో ఇద్దరు స్థూలకాయులైతే 73 శాతం పిల్లలకు అది రావొచ్చు. ఎవరో ఒకరు స్థూలకాయులైతే పిల్లల్లో  45 శాతం మంది దీని బారిన పడుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో వివిధ రకాల జబ్బులకు వాడే మాత్రలు అధిక బరువుకు కారణమవుతాయి.
  • పిల్లల్లో అధిక బరువు నివారించాలంటే అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్‌ ఆహారం (చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కూల్‌డ్రింకులు) తగ్గించాలని ఇటీవల ‘జాతీయ పోషకాహార సంస్థ’ (ఎన్‌ఐఎన్‌) విడుదల చేసిన సర్వే పేర్కొంది.
  • ఒక కిలో బరువు పెరిగితే అదనంగా 30 కిలోమీటర్ల దూరం వరకు రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుంది. దీంతో గుండె ఎక్కువ బలంతోపనిచేయడం వల్ల గుండె వైఫల్యానికి దారితీస్తుంది. 
  • ఒబేసిటి ఉన్నట్లు అనిపిస్తే ప్రభుత్వ జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యులను సంప్రదించాలని జనగామ వైద్యాధికారి హరీశ్‌రాజ్‌  తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆర్‌బీఎస్‌కే పరీక్షల్లో ఊబకాయం బారిన పడిన 18 సంవత్సరాలలోపు పిల్లలు

  •  హనుమకొండ  11,675
  • వరంగల్‌ 9,535
  • మహబూబాబాద్‌ 8,876
  • జనగామ 5,741
  • ములుగు 3,661
  • జయశంకర్‌ భూపాలపల్లి 3,450

సమతుల ఆహారమే సరైనది

అధిక బరువు పెరగకుండా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పప్పులు, చిక్కుళ్లు మేలు చేస్తాయి. ఆహారంలో బియ్యం ఒక్కటే గాకుండా చిరుధాన్యాలు కలిసి ఉండేలా చూసుకోవాలి. పప్పుదినుసుల వల్ల ప్రొటీన్లు ఎక్కువ లభిస్తాయి. మంచి కొవ్వు కోసం రోజుకు 25-35 గ్రాముల నూనెగింజలు (వేరుశనగ, గుమ్మడి, బాదం) తీసుకుంటే మంచిది. ఇంట్లో తయారుచేసినవే తినిపించాలి.  పిల్లలు తినడంలేదని వారడిగిన చిరుతిళ్లను ప్రోత్సహించొద్దు. చక్కర ఎక్కువగా ఉన్న మిఠాయిలు ఇవ్వొదు. ఆహారం తిన్నవెంటనే మిఠాయిలు, జ్యూస్, కూల్‌డ్రింక్‌లు ఇవ్వొద్దు. మాంసాహారం తగ్గించాలి. చిన్నచిన్న వ్యాయామాలు చేయించాలి. పిల్లలతోపాటు పెద్దలు ప్రతి రోజు ఏదో ఒక సమయంలో వ్యాయామం అలవాటు చేసుకున్నట్లయితే అధిక బరువు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

 డా.రోహిణి సింధూరి,  పోషకాహార  నిపుణురాలు, ఎంజీఎం ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని