logo

‘రేవంత్‌కు పాలనపై పట్టు లేదు’

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు.

Published : 25 May 2024 03:23 IST

ప్రసంగిస్తున్న డీకే అరుణ, చిత్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, సిటిజన్‌ ఫోరం
కన్వీనర్‌ డా.సమ్మిరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఆర్‌రెడ్డి,
ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

సుబేదారి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై పట్టు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం రాత్రి హనుమకొండలో ఓరుగల్లు సిటిజన్‌ ఫోరం కన్వీనర్‌ డాక్టర్‌ సమ్మిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మేధావుల సదస్సులో ఆమె ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసీ ఆచరణ సాధ్యం కాని ఆరు గ్యారంటీ పథకాల హామీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పూటకో మాటతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను మండలిలో ప్రశ్నించే భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే కె.వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. మేధావులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా విధానాన్ని ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని, దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షుడు పి.మురళీమనోహర్‌  పాల్గొన్నారు.

వర్చువల్‌గా ప్రసంగించిన మధ్యప్రదేశ్‌ సీఎం: సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ హైదరాబాద్‌ నుంచే వర్చువల్‌గా తన సందేశాన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.
మడికొండ: హామీలపై కాంగ్రెస్‌ను నిలదీసే ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మడికొండలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని వరంగల్‌ ఎంపీ అభ్యర్థి  అరూరి రమేశ్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని