logo

పట్టాలెక్కనున్న ప్రగతి..!

రామగుండం-మణుగూరు కోల్‌ కారిడార్‌ దశాబ్దాల కల.. బొగ్గు, సరకు రవాణా నిమిత్తం దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ప్రతిపాదించిన ఈ రైల్వే లైను ఏర్పాటుకు మరోసారి కదలిక వచ్చింది.

Published : 25 May 2024 03:37 IST

రామగుండం.. మణుగూరు రైల్వే లైనుపై కదలిక
బొగ్గు, ప్రజా రవాణా సులభతరం

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రం సమీపంలో రైల్వేలైను
కోసం మట్టినమూనాలు సేకరిస్తున్న సిబ్బంది

రామగుండం-మణుగూరు కోల్‌ కారిడార్‌ దశాబ్దాల కల.. బొగ్గు, సరకు రవాణా నిమిత్తం దాదాపు నాలుగు దశాబ్దాల కిందట ప్రతిపాదించిన ఈ రైల్వే లైను ఏర్పాటుకు మరోసారి కదలిక వచ్చింది. గత కేంద్ర బడ్జెట్‌లో ఈ కొత్త రైల్వే లైనుకు రూ.10 కోట్లు కేటాయించారు. తాజాగా భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైలు కల నెరవేరే అవకాశం ఉంది.

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి

అధికారుల అంచనా ప్రకారం ఈ రైల్వే లైను పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి రాఘవాపురం మీదుగా మంథని, మల్హర్‌ మండలం తాడిచర్ల, భూపాలపల్లి, గణపురం, ములుగు జిల్లా వెంకటాపుర్, తాడ్వాయి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వరకు ఉంటుంది.

తగ్గనున్న దూరాభారం: రామగుండం నుంచి మణుగూరుకు వరంగల్, మహబూబాబాద్‌ మీదుగా 300 కిలోమీటర్లు  ఉంటుంది. కొత్త రైలు మార్గంతో ఇది 207.80 కిలోమీటర్లకు తగ్గుతుంది. దాదాపు 90 కి.మీ. వరకు ఆదా అవుతుంది. మణుగూరు నుంచి భద్రాచలం, కొత్తగూడెం, విజయవాడ, విశాఖపట్నం, తదితర ప్రాంతాలకు చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికులకు దూరాభారం తగ్గుతుంది.

 సర్వేలో భాగంగా వేసిన మార్కింగ్‌ 

రెండేళ్లుగా సర్వేలు ముమ్మరం..

భూపాలపల్లిలో 1984లోనే బొగ్గు గనులు ఏర్పాటయ్యాయి. బొగ్గు తరలింపునకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు అప్పుడే బీజం పడింది. అది పట్టాలెక్క లేదు. 1994, 2008, 2018 లో సర్వేలు చేపట్టారు. నివేదికలు కేంద్రానికి సమర్పించారు. రెండేళ్ల కిందట సరకు రవాణా నిమిత్తం డెడికేటెడ్‌ ఫ్రైట్ కారిడార్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీ) వారు నూతన మార్గానికి ఈ మార్గంలో సర్వే చేపట్టారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు.

పెరిగిన  అంచనాలు..

ఈ రైల్వేలైను 2013-14లో రూ.1,112 కోట్ల అంచనాతో మంజూరైంది. తర్వాత రూ.2,911 కోట్లకు అంచనా వ్యయం పెంచారు. పనులు చేపట్టేందుకు నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు.

కోల్‌ కారిడార్‌గా..

ఈ రైలు మార్గం ఏర్పాటైతే సులభంగా, వేగంగా సరకు రవాణాను వ్యాగన్ల ద్వారా ఒకచోటు నుంచి మరోచోటుకు చేర్చవచ్చు. రామగుండం-మణుగూరు రైలు మార్గం ద్వారా పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను కోల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దనున్నారు. సింగరేణి ప్రాంతాలకు బొగ్గు రవాణా చేయవచ్చు. భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చు. ములుగు జిల్లాలోని లాటరైట్ లాంటి ఖనిజాలను రవాణా చేసే వీలుంటుంది. 

భూసేకరణ ప్రక్రియతో ముందడుగు..

ఈ రైల్వే లైను ఒక్కో దశ దాటుకుని భూసేకరణ గెజిట్‌ నోటిఫికేషన్‌ వరకు వచ్చింది. నాలుగు జిల్లాల పరిధిలో 207.80 కిలోమీటర్ల రైల్వే లైను కోసం భూసేకరణ చేపట్టే అవకాశం ఉంది. ఇది దశల వారీగా చేపట్టనున్నారు. ముందుగా కేంద్ర రైల్వే శాఖ నుంచి ప్రత్యేక బృందం పర్యటించనుంది. ఆ తర్వాత ఎన్‌జీటీ, అటవీశాఖ అనుమతులు తీసుకోనున్నారు. అనంతరం భూనిర్వాసిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతారు. భూములకు ధరలు నిర్ణయించి పరిహారం చెల్లించిన అనంతరం పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.

పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి దోహదం

ప్రతిపాదిత రామగుండం-మణుగూరు రైల్వేలైను ఏర్పాటైతే సరకు రవాణాతో పాటు ప్రజారవాణా ప్రారంభిస్తే జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. కాళేశ్వరం, రామప్ప, మేడారం, కోటగుళ్లు, మల్లూరు ఆలయాలతో పాటు లక్నవరం జలాశయం, బొగత జలపాతం, పాండవుల గుట్టలు, తదితర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక కేంద్రాలకు రైలుమార్గం ద్వారా వెళ్లొచ్చు. మేడారం మహాజాతర, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి మరింత ఆదరణ లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని