logo

ఈనామ్‌కు ఆరేళ్లు.. అమలుకు ఎన్నేళ్లు..?

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడం, మోసాలను అరికట్టి జవాబుదారీతనాన్ని కల్పించడం వంటి ఉన్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2016లో జాతీయ వ్యవసాయ విపణి (నామ్‌) విధానాన్ని తీసుకొచ్చింది.

Published : 25 May 2024 03:52 IST

అడ్డదారుల కోసమే పట్టింపులేనితనం
కేసముద్రం, ఎనుమాముల మార్కెట్, నెహ్రూసెంటర్‌: న్యూస్‌టుడే

ఎనుమాముల మార్కెట్‌

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెట్‌ ఆదాయాన్ని పెంచడం, మోసాలను అరికట్టి జవాబుదారీతనాన్ని కల్పించడం వంటి ఉన్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 2016లో జాతీయ వ్యవసాయ విపణి (నామ్‌) విధానాన్ని తీసుకొచ్చింది. ఆరేళ్లు దాటుతున్నా ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.. టెండర్లకు మాత్రమే పరిమితమైంది. అడ్డదారుల కోసమే కొంత మంది వ్యాపారులు ఈనామ్‌ అమలుకు సహకరించడం లేదని.. వారికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

టెండర్లకు మాత్రమే పరిమితం

ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్, జనగామ, పరకాల, నర్సంపేట, కేసముద్రం, మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లలో ఈనామ్‌ అమలు చేస్తున్నారు. సౌకర్యాలు కొరత, రైతులు, వ్యాపారులు, మార్కెట్‌ సిబ్బందికి దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. దోపిడీ ఎప్పటిలాగే కొనసాగడంతో రైతులు నష్టపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌ బయట ఖరీదు నిర్వహిస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు.

కేసముద్రం మార్కెట్‌లో విక్రయానికి వచ్చిన కంది రాశులపై ఈనామ్‌ చీటీలు

కల్పించాల్సిన సౌకర్యాలు ఇవి..

 • మార్కెట్‌ యార్డులో అంతటా వైఫై సౌకర్యం 
 • గేట్ల వద్ద వేబ్రిడ్జి 
 • నాణ్యత వివరాలను లాట్‌ నెంబరు ఆధారంగా అంతర్జాలంలో నమోదు
 • ఇతర రాష్ట్రాలు, జిల్లాల వ్యాపారులు ఖరీదు చేసేలా ప్రత్యేక చర్యలు 
 • సరకులు నిల్వకు శీతల గిడ్డంగులు ఏర్పాటు 
 • సరకు విక్రయించిన డబ్బులు అదే రోజు ఆన్‌లైన్‌లో రైతు ఖాతాలో జమ 
 • రైతుబంధు పథకంలో సరకులకు 70 శాతం రుణం 
 • కనీస ధరకు తక్కువ ధరతో కోట్‌ చేయకుండా అంతర్జాలంలో ఏర్పాట్లు
 • టెండరు తెరిచిన వెంటనే రైతుల ఫోన్‌కు సంక్షిప్త సమాచారం

అమల్లోకి వస్తే..

ఈ నామ్‌ విధానంలో మార్కెట్‌లోని అన్ని విభాగాలను కంప్యూటరీకరిస్తారు. ఫలితంగా మార్కెట్‌ ప్రధాన ద్వారం నుంచే పారదర్శకత మొదలవుతుంది. 

 •  జీరో వ్యాపారం లేకపోవడంతో మార్కెట్‌ ఆదాయం పెరుగుతుంది. 
 • ధర కోడ్‌ చేయడం రహస్యంగా ఉండడంతో వ్యాపారులు మధ్య పోటీ పెరుగుతుంది. 
 • దేశవ్యాప్తంగా వ్యాపారులు టెండరు వేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.
 •  రైతులకు అదే రోజు ఆన్‌లైన్‌లో చెల్లింపు ఉంటుంది
 •  పంట నాణ్యతను శాస్త్రీయంగా పరీక్షించడం వల్ల రైతుకు సరైన ధర లభిస్తుంది.
 •  దేశవ్యాప్తంగా మార్కెట్లలో పలుకుతున్న ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

రైతులకు మేలు జరుగుతుంది

రెండెకరాల్లో మిర్చి సాగు చేశాను. మొదటి విడతలో 11 క్వింటాళ్ల మిర్చి క్వింటాలు ధర రూ.16 వేల చొప్పున విక్రయించాను. మార్కెట్‌ నిబంధనల ప్రకారం రూ.3,520 కమీషన్‌ తీసుకోవాల్సి ఉండగా అదనంగా మరో రూ.3,520 తీసుకున్నారు. ఈనామ్‌ పూర్తిస్థాయిలో అమలు జరిగితే కాంటా నిర్వహించిన వెంటనే ఆన్‌లైన్‌లో సొమ్ము జమవుతుంది. అదనంగా కమీషన్‌ చెల్లించేది ఉండదు. అమలవుతే రైతులకు మేలు జరుగుతుంది.

 కన్నెబోయిన చిరంజీవి, రైతు, ధర్మారావుపేట, ఖానాపురం

సాంకేతిక పరికరాలను సమకూరుస్తున్నాం

ఈనామ్‌ అమలు కోసం అవసరమైన సాంకేతిక పరికరాలను సమకూర్చుతున్నాం. వరంగల్, ఖమ్మం మార్కెట్లలో మిర్చి ఎక్కువ రకాలు ఉండటంతో ఈనామ్‌ ఖరీదు చేయడానికి క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్‌ మార్కెట్లలో మిర్చి ఈనామ్‌లో ఖరీదు చేస్తున్నాం. ఆన్‌లైన్‌ చెల్లింపుల సమస్య అన్ని రాష్ట్రాల్లో ఉంది. క్షేత్రస్థాయిలో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం.

 మల్లేశం, మార్కెటింగ్‌ శాఖ సంయుక్త సంచాలకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని