logo

చతికిల‘బడి’న అభివృద్ధి

పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ బడులకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని గత ప్రభుత్వం 22 ఏప్రిల్, 2022 గత రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది.

Published : 25 May 2024 06:14 IST

న్యూస్‌టుడే, వరంగల్‌ విద్యావిభాగం

పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్‌ బడులకు ధీటుగా నాణ్యమైన విద్యను అందించాలని గత ప్రభుత్వం 22 ఏప్రిల్, 2022 గత రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఇప్పటి వరకు అశించిన మేరకు అభివృద్ధి పనుల జరగకపోవడం నిరాశకు గురి చేస్తోంది. జిల్లాలో మొదటి విడతలో 227 బడులను ఎంపిక చేయగా.49 పాఠశాలలకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో 39 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన పదితోపాటు మరో 27 పాఠశాలలకు సంబంధించి 25 శాతం నిధులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు బదిలీ చేశారు. ఇటీవల కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, నిధులు పూర్తిస్థాయిలో లేకపోడంతో పనులు కుంటుపడ్డాయి.

నర్సంపేట, న్యూస్‌టుడే

అసంపూర్తిగానే పనులు

వర్ధన్నపేట: మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు- మన బడి కింద ఎంపిక చేసి పనులు చేపట్టారు. దమ్మన్నపేటలోని రెండు పాఠశాలలు మినహా మిగిలిన 10 పాఠశాలల్లో పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వర్ధన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఒక్క ప్రహరీ తప్ప ఇతర పనులు కాలేదు. ఈ పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. ఇటీవల ఎన్నికల నిమిత్తం రెండు మరుగుదొడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేశారు.

పిల్లర్లకే పరిమితమైన భోజనశాల

  •   పాఠశాల : జడ్పీఎస్‌ఎస్‌ బాలుర ఉన్నతపాఠశాల, నర్సంపేట
  • నిధుల కేటాయింపు :  రూ.24 లక్షలు 
  • చేపట్టాల్సిన పనులు : భోజనశాల, విద్యుత్తు మరమ్మతు, బిగింపు పనులు
  •  పనులు ఏ దశలో ఉన్నాయి : విద్యుత్తు మరమ్మతు, బిగింపు పనులు రెండు తరగతి గదుల మినహా అన్ని గదుల్లో పూర్తి చేశారు. భోజనశాల నిర్మాణానికి వేసిన పిల్లర్లు నిర్మించారు. రెండేళ్ల నుంచి పనులు మధ్యలో నిలిచిపోయాయి.
  • ఇతర నిధులు కేటాయించే అవకాశముందా:  అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరుగు దొడ్లు, మూత్రశాలల మరమ్మతులు, తాగునీరు, చిన్న మరమ్మతుల కోసం రూ.7.80 లక్షలు మంజూరు చేయగా.. స్లమ్‌ లెవెల్‌ సమాఖ్య (ఎస్‌ఎల్‌ఎఫ్‌) మహిళా సభ్యులు పనులు చేయిస్తున్నారు.

అన్ని దశల్లో జాప్యమే..

జిల్లాలో పాఠశాలలను పరిశీలిస్తే చాలా వరకు పనులు ప్రారంభానికి శంకుస్థాపనలు మాత్రమే చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలు, అంచనాలు, పరిశీలనలు, ఆమోదం వంటి వాటికే ఎక్కువ సమయం పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు సర్కార్‌ పాఠశాలల పునఃప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో జూన్‌ మొదటి వారంలో బడిబాట కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వేసవి సెలవుల్లో పాఠశాలల్లో సదుపాయాలను అభివృద్ధి చేసి బడుల ప్రారంభం నాటికి వాటిని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

సది రోజుల్లో పూర్తి చేయాలని సూచించాం

గత ప్రభుత్వం మన ఊరు.. మన బడి  కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుత ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా జిల్లాలోని 645 పాఠశాలలను ఎంపిక చేశాం. అభివృద్ధి పనుల బాధ్యత స్థానిక మహిళా సంఘాలకు అప్పగించాం. అంచనాలు 24.09 కోట్లు వేశాం. దీనిలో 6.25 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. 139 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. జూన్‌ 10 వరకు మిగతా పాఠశాలల్లో పూర్తి చేయాలని ఆదేశించాం. మన ఊరు మన బడి కింద చేపట్టిన పనులు పూర్తికాని చోట ప్రత్యేక నిధులతో పూర్తి చేయాలని సూచించాం.

డి.వాసంతి, జిల్లా విద్యాశాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు