logo

భద్రకాళి, ఉర్సు చెరువులతోనూ ప్రమాదమే!

స్మార్ట్‌ సిటీ పథకం ప్రతిపాదించిన చెరువుల సుందరీకరణ, బండ్‌ల విస్తరణ పనుల్లో అంతులేని జాప్యంతో వరంగల్‌ నగరానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది.

Published : 25 May 2024 04:03 IST

వరంగల్‌ పోతన నగర్‌ వైపు భద్రకాళి చెరువు కట్ట బలహీనం

స్మార్ట్‌ సిటీ పథకం ప్రతిపాదించిన చెరువుల సుందరీకరణ, బండ్‌ల విస్తరణ పనుల్లో అంతులేని జాప్యంతో వరంగల్‌ నగరానికి ముంపు ప్రమాదం పొంచి ఉంది. శుక్రవారం ‘ఈనాడు’లో ‘వడ్డేపల్లి బండ్‌కు..పెను ముప్పు’ కథనంతో అందరి దృష్టి చెరువులపై పడింది. గతేడాది భారీ వరదలతో హనుమకొండ వడ్డేపల్లి, వరంగల్‌ భద్రకాళి, ఉర్సు రంగసముద్రం చెరువుల పరిసరాలన్నీ ముంపునకు గురయ్యాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు బడా గుత్తేదారులకు దాసోహమవుతున్నందునే మూడు, నాలుగేళ్లవుతున్నా పనులు పూర్తి కావడం లేదని, ఆర్నెల్లకోసారి గడువు మీద గడువు పొడిగిస్తూ వస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

భద్రకాళి చెరువు

వరంగల్‌- హనుమకొండ ప్రాంతాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. గత 15 ఏళ్లుగా బొందివాగు నాలా ద్వారా వరద నీరు ముంచెత్తుతోంది. పది కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా భద్రకాళి బండ్‌ రెండో విడత పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. సుందరీకరణ పేరుతో చెరువు కట్ట బలహీనమైంది. గతేడాది పోతననగర్‌ వైపు మట్టి కట్టకు గండి పడింది. వరదనీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతవరకు మట్టి కట్టను బలోపేతం చేయలేదు. ఇరిగేషన్, గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హంటర్‌రోడ్‌ 12 మోరీల నాలా నుంచి పోతన నగర్‌ వరకు వరద నీటి కాలువల పనులు పూర్తవ్వలేదు. భారీ వర్షాలు కురిస్తే  రామన్నపేట, హంటర్‌రోడ్‌ ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయి.

భద్రకాళి చెరువు కట్ట పక్కన స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ పనులు

ఉర్సు చెరువు: స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా ఉర్సు రంగసముద్రం (ఉర్సు చెరువు) సుందరీకరణ పనులు ప్రతిపాదించారు. రెండేళ్లవుతున్నా అదిగో, ఇదిగో అనడం తప్ప పనులు ముందుకు సాగడం లేదు. నాలుగైదు నెలలుగా బండ్‌ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. గతేడాది ఉర్సుగుట్ట వంద అడుగుల రోడ్డులో రెండు, మూడు చోట్ల బండ్‌కు గండ్లు పడ్డాయి. వాటిని ఇంతవరకు ముట్టుకోలేదు. భారీ వర్షాలు పడితే చెరువులో నీళ్లు రోడ్డు మీదకు వచ్చి నగరాన్ని ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది.

గతేడాది వర్షాకాలంలో ఉర్సు  రంగసముద్రం బండ్‌కు గండి

నీటిపారుదల శాఖకు లేఖ రాస్తాం

కార్పొరేషన్‌ : వరంగల్‌ పోతననగర్‌ వైపు భద్రకాళి చెరువు కట్టను బలోపేతం చేసే బాధ్యత నీటిపారుదల శాఖదే. హంటర్‌రోడ్‌ బొందివాగు నాలా అభివృద్ధిలో భాగంగా పోతననగర్, కాపువాడ మత్తడిల వైపు డౌన్‌ స్రీˆమ్‌ పల్వింగ్‌ షట్టర్లు ఏర్పాటు చేయాలి. భద్రకాళి బండ్‌ పనుల వేగం పెంచుతాం. ఉర్సు రంగసముద్రం చెరువును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

ప్రవీణ్‌చంద్ర, పర్యవేక్షక ఇంజినీర్, గ్రేటర్‌ వరంగల్‌


వడ్డేపల్లి బండ్‌ను పరిశీలించిన అధికారులు

-‘ఈనాడు’ కథనంపై కమిషనర్‌ ఆరా

కార్పొరేషన్, న్యూస్‌టుడే: హనుమకొండ వడ్డేపల్లి చెరువుకు ప్రమాదం పొంచి ఉందా?, స్మార్ట్‌సిటీ పథకం ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులతో ఇబ్బందులున్నాయా?, ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్ల హెచ్చరికలు ఎందుకు పట్టించుకోలేదని పలువురు సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సుందరీకరణ పేరుతో చెరువులు కొల్ల గొడుతున్నారని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ‘ఈనాడు’లో ‘వడ్డేపల్లి బండ్‌కు..పెనుముప్పు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే ఆరా తీశారు. కమిషనర్‌ ఆదేశానుసారం బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు మానిటరింగ్‌ కమిటీ(పీˆఎంసీˆ) టీం లీడర్‌ ఆనంద్‌ వొలేటి తదితర అధికారులు వడ్డేపల్లి చెరువును సందర్శించారు. చెరువు కట్ట కట్ట విస్తరణ, ఇతర పనులు పరిశీలించారు. ఒకటి రెండు రోజుల్లో ఇరిగేషన్‌ శాఖ ఇంజినీర్లతో సమావేశమయేయ అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని