logo

ఒప్పంద బిల్‌ కలెక్టర్లకు మంగళం

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తిపన్నులో ఒప్పంద బిల్‌కలెక్టర్లు చేతివాటం ప్రదర్శించడంతో 11 మందిని బాధ్యతల నుంచి తొలగించేశారు.

Published : 26 May 2024 04:50 IST

సీడీఎం ఉత్తర్వులతో అయోమయం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తిపన్నులో ఒప్పంద బిల్‌కలెక్టర్లు చేతివాటం ప్రదర్శించడంతో 11 మందిని బాధ్యతల నుంచి తొలగించేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ మినహా మిగిలిన నగరపాలికలు, పురపాలికల్లో సైతం ఒప్పంద పద్ధతిపై పనిచేస్తున్న బిల్‌కలెక్టర్లను పన్నుల వసూళ్ల బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలు(సీడీఎంఏ) దివ్య దేవరాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గ్రేటర్‌ వరంగల్‌ పన్నుల విభాగంలో 60 మంది ఒప్పంద బిల్‌  కలెక్టర్లకు మంగళం పాడేందుకు రంగం సిద్ధమైంది. విలీన గ్రామాల నుంచి వచ్చిన కారోబార్లు, పీహెచ్‌ వర్కర్లు తాత్కాలిక అవసరాల కోసం కొన్నేళ్లుగా బిల్‌ కలెక్టర్లుగా కొనసాగుతున్నారు. నగరంలోని 66 డివిజన్లలో పన్నుల వసూళ్లలో వీరిదే సింహభాగం. సీడీఎంఏ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులు అమలుపై గ్రేటర్‌ వరంగల్‌ అధికారులు అయోమయంలో పడ్డారు.

  •  గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో కాజీపేట, కాశీబుగ్గ సర్కిల్‌ కార్యాలయాల పరిధిలో 37 మంది ప్రభుత్వ ఉద్యోగులు బిల్‌ కలెక్టర్లుగా, 60 మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెవెన్యూ వార్డుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 11 ఈ-సేవ కేంద్రాల్లో కొంతమంది పనిచేస్తున్నారు.
  •  సీడీఎంఏ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 60మంది ఒప్పంద బిల్‌ కలెక్టర్లు, ఆరుగురు కంప్యూటర్‌ ఆపరేటర్లను పన్నుల వసూళ్ల నుంచి తొలగించనున్నారు. వీరి వద్ద ఉన్న హ్యాండ్‌ డివైజెస్‌ మిషన్లు తీసుకుంటారు. వీరి స్థానంలో కొత్తగా నియమితులైన 38 మంది వీఆర్వోలు, వీఆర్‌ఏలు, వార్డు ఆఫీసర్లకు బిల్‌ కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని