logo

ఎంసీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు

జనగామ జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డు వైపు ఏడు కిలోమీటర్ల దూరంలో చంపక్‌హిల్స్‌ గుట్ట ప్రాంతంలో గత ఆరేళ్ల క్రితం అత్యాధునిక వైద్య వసతులతో మాతా, శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్‌)ను ప్రారంభించారు.

Published : 26 May 2024 05:00 IST

జనగామ టౌన్, న్యూస్‌టుడే: జనగామ జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డు వైపు ఏడు కిలోమీటర్ల దూరంలో చంపక్‌హిల్స్‌ గుట్ట ప్రాంతంలో గత ఆరేళ్ల క్రితం అత్యాధునిక వైద్య వసతులతో మాతా, శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్‌)ను ప్రారంభించారు. జనగామ జిల్లాలోని 12 మండలాలే కాకుండా సమీపంలో ఉన్న యాదాద్రి-భువనగిరి, సిద్ధిపేట జిల్లాలకు చెందిన మరో ఆరు మండలాలకు జనగామ జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్‌ పెద్దాసుపత్రులుగా సేవలందిస్తున్నాయి. మాతా, శిశు సేవల్లో ఎంసీహెచ్‌ ఆసుపత్రి మెరుగైన పనితీరు కనబరుస్తూ ప్రతి నెలా రికార్డు స్థాయి ప్రసవాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.

అత్యాధునిక వసతులు..

ఎంసీహెచ్‌ ఆసుపత్రిని తొలుత 150 పడకల స్థాయిలో ప్రారంభించగా వైద్య కళాశాల మంజూరు కావడంతో మరో వంద పడకల వరకు పెంచారు. అత్యాధునిక శస్త్ర చికిత్స గదులు, ప్రైవేటు కార్పొరేట్‌ స్థాయి ఆసుపత్రుల్లో మాదిరిగా గర్భిణులు, బాలింతల కోసం ఓపీ, స్కానింగ్‌ విభాగాలు, వార్డులు ఏర్పాటు చేశారు. నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేసి అత్యాధునిక సేవల కోసం ఎస్‌ఎన్‌సీయూ వంటి విభాగాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి 102 అంబులెన్స్‌ల ద్వారా గర్భిణులను తీసుకొస్తూ పరీక్షలు జరుపి, కాన్పులు చేస్తున్నారు. ప్రతి నెలా సగటున 300 నుంచి 350 వరకు కాన్పులు చేస్తున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్‌ విభాగాల్లో ప్రొఫెసర్‌ స్థాయి వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రతి రోజూ ఓపీలో 150 నుంచి 200 వరకు గర్భిణులకు పరీక్షలు చేస్తున్నారు. సోమవారానికి ఈ సంఖ్య మరింత పెరిగి 250 నుంచి 300 వరకు ఉంటోంది. ఎంసీహెచ్‌లో రికార్డు స్థాయి ప్రసవాలతో గత కొన్నేళ్లుగా జిల్లాలోని ప్రైవేటు మెటర్నటీ ఆసుపత్రుల్లో కాన్పులు గణనీయంగా తగ్గిపోయాయి.

సాధారణ కాన్పులపై ప్రత్యేక దృష్టి..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు ఎక్కువగా చేయాలని రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలు విధించడంతో ఎంసీహెచ్‌లో సాధారణ కాన్పులు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ కాన్పులు 60 శాతం, సిజేరియన్‌ కాన్పులు 40 శాతం లోపు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రత్యేకంగా మిడ్‌వైఫరీ నర్సుల సేవలు ప్రారంభించారు. వీరంతా గర్భిణులకు శారీరక వ్యాయామాలు చేయించడంతో పాటు కౌన్సిలింగ్‌ ఇస్తూ సాధారణ కాన్పులు చేయడానికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఎంసీహెచ్‌లో సగటున నెలకు 60 శాతం సిజేరియన్, 40 శాతం సాధారణ కాన్పులు నమోదవుతున్నాయి. ఎంసీహెచ్‌కు కాన్పులు నిమిత్తం వచ్చే వారి సంఖ్య భారీగా ఉండటంతో త్వరలో వైద్యవిధాన పరిషత్‌ ఆధీనంలోని బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, జఫర్‌గఢ్‌ సీహెచ్‌సీలను బలోపేతం చేసి అక్కడ ప్రసూతి కాన్పుల సంఖ్యను పెంచడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటీవలనే చర్యలు తీసుకోవడం ప్రారంభించారు.

మెరుగైన సేవలను అందిస్తున్నాం..  

- డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఎంసీహెచ్‌ సూపరింటెండెంట్‌

జనగామ ఎంసీహెచ్‌లో మెరుగైన మాతా, శిశు సేవలను అందిస్తున్నాం. నెలకు రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. అత్యాధునిక వైద్య వసతులన్నీ ఇక్కడే ఉన్నాయి. నవజాత శిశువులకు ఎస్‌ఎన్‌సీయూలో ఆధునిక వైద్యం అందుతోంది. జిల్లా ప్రజల్లో ఎంసీహెచ్‌పై ఉన్న నమ్మకం మేరకు అంకితభావంతో సేవలందించడానికి వైద్యులు, సిబ్బంది పని చేస్తున్నారు. 


ఎంసీహెచ్‌లో కాన్పుల వివరాలు.. 2023లో..
సాధారణ కాన్పులు: 1862
సిజేరియన్‌ : 2650
2024లో జనవరి నుంచి మే22 వరకు..
సాధారణ కాన్పులు: 590
సిజేరియన్‌ : 1049 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని