logo

‘ఆ రెండు పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు’

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న భాజపా, భారాస అభ్యర్థులకు ఓట్లడిగే హక్కు లేదని.. ఆ రెండు పార్టీలు నిరుద్యోగులను మోసం చేశాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు

Published : 26 May 2024 05:05 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పక్కన సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు రాజ్‌కుమార్, సాయిలు 

భూపాలపల్లి, న్యూస్‌టుడే : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీలో ఉన్న భాజపా, భారాస అభ్యర్థులకు ఓట్లడిగే హక్కు లేదని.. ఆ రెండు పార్టీలు నిరుద్యోగులను మోసం చేశాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఏటా రెండు కోట్లు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. జీఎస్టీ పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేశారని, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, 12 శాతం గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి, కాంగ్రెస్‌ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకే పట్టభద్రులు, ఉద్యోగులు, మొదటి ప్రాధాన్య ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ ఊసరవెళ్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కొరిమి రాజ్‌కుమార్, బందు సాయిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్లపాటు పాలించిన భారాస ప్రభుత్వం విద్య, వైద్యంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, యూనివర్సిటీల అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు  సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్‌రెడ్డి, నాయకులు రాంనర్సింహారెడ్డి, చల్లూరి మధు, దేవన్, కొంరయ్య, రాజేందర్, సాంబమూర్తి, పైడిపెల్లి రమేష్‌ పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు