logo

పనుల్లో జాప్యం.. పంచాయతీలకు శాపం

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పంచాయతీ కార్యాలయాలకు, నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో  కొత్త గూడు       కరవైంది. కొత్త భవనాల నిర్మాణ బాధ్యతలను చేపట్టిన పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ అధికారుల తాత్సారంతో నెలల తరబడి అసంపూర్తిగానే మిగిలాయి.

Updated : 26 May 2024 06:55 IST

జిల్లాలో శిథిలావస్థలో ఉన్న పంచాయతీ కార్యాలయాలకు, నూతనంగా ఏర్పడిన పంచాయతీల్లో  కొత్త గూడు కరవైంది. కొత్త భవనాల నిర్మాణ బాధ్యతలను చేపట్టిన పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ అధికారుల తాత్సారంతో నెలల తరబడి అసంపూర్తిగానే మిగిలాయి. ఇరుకైన అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న కార్యాలయాల్లో  అవసరమైన సామగ్రిని, ముఖ్యమైన దస్త్రాలను భద్రపరచడానికి ఉద్యోగులు, పాలకులు అవస్థలు పడుతున్నారు.  

ఈనాడు,  మహబూబాబాద్‌ :  వర్షాకాలంలో పాత భవనాలు ఉరిసి వాటిలోని విలువైన దస్త్రాలు తడిసిముద్దవుతున్నాయి. సర్పంచులు ఉన్నప్పుడు పంచాయతీల రికార్డులు తడవకుండా వారి ఇళ్లలో పెట్టుకున్నారు. ఇప్పుడు వారి పదవీ కాలం ముగియడంతో ఆ దస్త్రాలు తిరిగి పంచాయతీ కార్యాలయాలకు చేరాయి. వానాకాలం వస్తున్నందున ఈ భవనాల్లో అవి తడిసే ప్రమాదం ఉంది.  అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారం దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాత భవనాల స్థానంలో కొత్త వాటి నిర్మాణం చేపట్టిన పంచాయతీ ఇంజినీరింగ్‌ విభాగం, పనుల్లో జాప్యం చేస్తుండటం పంచాయతీలకు శాపమైంది. ఉపాధి హామీ, ప్రభుత్వ నిధులతో చేపట్టిన భవనాలు చాలా వరకు అసంపూర్తిగా మిగిలాయి.

పాతభవనంలోనే పాలన

 నెల్లికుదురు మండలం మదనతుర్తి పంచాయతీ కార్యాలయం ఇది. కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో 2016-17లో రూ.16 లక్షలతో కొత్తది నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. రూ.10.83 లక్షలు పనులు చేపట్టి స్లాబ్‌ వేశారు. గోడలకు సిమెంట్‌ వేయలేదు. ఫినిషింగ్‌ పనులు పూర్తి చేయలేదు. వానపడితే ఉరుస్తుందని తాత్కాలిక మరమ్మతులు చేయించారు. అయినా అందులో సమావేశాల నిర్వహణ ఇరుకుగా ఉంది. కొత్త భవనం పనులు నిలిచిపోవడానికి కారణాలేమిటో ఎవరికీ తెలియదు. 
-న్యూస్‌టుడే, నెల్లికుదురు


సమస్యలు ఇవీ

తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదు. గ్రామ సభల నిర్వహణకు సరిపడా స్థలాలు లేక ఆరుబయట నిర్వహణ చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించినప్పుడు పంచాయతీ వద్ద కాకుండా మరో చోట నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీ కార్యాలయాలను చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లోని ఒక గదిలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం టీఎస్‌ పైబర్‌ ద్వారా పంచాయతీలకు కల్పిస్తున్న ఇంటర్‌నెట్‌ సౌకర్యానికి అంతరాయం కలుగుతుంది. ప్రత్యేకాధికారుల పాలనలో నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో వారు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలి.


రికార్డులు తడుస్తున్నాయి 

బయ్యారం మండలం సంతులాల్‌పోడ్‌తండా పంచాయతీ కార్యాలయం ఇది. ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. నూతన  పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు వచ్చి ఏడాది అవుతోంది. సరిపడా స్థలం లేకపోవడంతో నిర్మాణం చేపట్టడం లేదు. స్థలం గుర్తించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు.  ప్రస్తుత అద్దె భవనంలో చినుకు పడితే అందులోని విలువైన రికార్డులు తడుస్తున్నాయి.

-న్యూస్‌టుడే, బయ్యారం


ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా

స్లాబ్‌ వేసి గోడల నిర్మాణం చేయకుండా కనిపిస్తున్న ఈ భవనం మహబూబాబాద్‌ మండలం పర్వతగిరి పంచాయతీ నూతన భవనం. 2016-17లో రూ.16 లక్షలతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. గోడల నిర్మాణం మధ్యలోనే వదిలేశారు. ఇప్పటివరకు రూ. 11.57 లక్షలు ఖర్చు చేశారు. నిధులున్నా పనులు చేయకపోవడంతో పాత భవనంలోనే అవస్థలు పడుతూ పాలన కొనసాగిస్తున్నారు.  
- న్యూస్‌టుడే, మహబూబాబాద్‌ రూరల్‌


భయంగా నిర్వహణ 

ఇది కొత్తగూడ మండలం గోపాలపురం గ్రామపంచాయతీ కార్యాలయం. చిన్నపాటి వర్షం పడితే చాలు ఉరుస్తుంది. రికార్డులు తడుస్తున్నాయి. భవనం పైకప్పు పెచ్చులుడుతున్నాయి. భారీ వాన కురిస్తే భవనం కూలే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు. అయినా అధికారులు భయంగా అందులోనే నిర్వహణ కొనసాగిస్తున్నారు. 
- న్యూస్‌టుడే, కొత్తగూడ


వివరాలు చూసి చెబుతా 

పంచాయతీ కార్యాలయల నిర్మాణ పనులపై జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ అధికారి సురేష్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. భవన నిర్మాణాలు ఏఏ దశలో ఉన్నాయనే వివరాలు చూసి సోమవారం చెబుతా. ఇప్పటికిప్పుడు ఎలా చెప్పగలను అంటూ సమాధానం ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని