logo

పట్టభద్రుల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య శనివారం తెలిపారు.

Published : 26 May 2024 05:24 IST

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వరంగల్‌ జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య శనివారం తెలిపారు. జిల్లాలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌ జరగనుందని, జిల్లాలోని మొత్తం 43,812 మంది పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. అందులో 27,038 మంది పురుషులు, 16,774 మంది స్త్రీలు ఉన్నారన్నారు. జిల్లా పరిధిలోని పట్టభద్రులందరికీ ఓటరు చీటీల పంపిణీ పూర్తి చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 11 రూట్లు, 23 లొకేషన్లు, 59 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వరంగల్‌ మండలంలో 21, ఖిలావరంగల్‌లో 10, గీసుకొండలో 4, సంగెంలో 3, నర్సంపేటలో 5, నెక్కొండ, పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

అందని పోల్‌ చీటీలు..

రంగశాయిపేట: రంగశాయిపేటలో పోల్‌ చీటీలు పంచలేదని పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో 19 బ్లాక్‌ 1, 2, 3 వార్డుల్లో బీఎల్‌ఓలు పోల్‌ చీటీలు పంచలేదని ఆరోపించారు.

27న ప్రత్యేక సాధారణ సెలవు

వరంగల్‌ కలెక్టరేట్‌: వరంగల్‌- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 27న ఓటర్లయిన కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగులకు ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య శనివారం తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలున్న విద్యాసంస్థలు, కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఈ నెల 26, 27 తేదీల్లో వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. ఇతర ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ఓటుహక్కు వినియోగించుకునేలా సంబంధిత యాజమాన్యాలు అవకాశం కల్పించాలన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని