logo

ముగిసిన పట్టభద్రుల ప్రచారం

వరంగల్‌ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, భారాస  ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి

Published : 26 May 2024 05:28 IST

సాధారణ ఎన్నికలను తలపించేలా పార్టీల అగ్రనేతలు రాక

ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్, భారాస  ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తరహాలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. వీరితోపాటు 49 మంది స్వతంత్రులు సైతం తలపడుతున్నారు. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, భారాస తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌కు చెందినవారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ఉమ్మడి నల్గొండవాసి. వీరంతా మూడు జిల్లాల పరిధిలో జోరుగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు.  ప్రతి రోజూ ఉదయం వాకర్స్‌ను కలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. 

లోక్‌సభ ఎన్నిక పోలింగ్‌ మే 13న ముగియగానే ప్రధాన పార్టీల అగ్రనేతలు పట్టభద్రుల ఎన్నికపై  దృష్టి సారించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి అగ్రనేతలు 12 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి పట్టభద్రులు భాజపాకే పట్టం కట్టి గుజ్జులను గెలిపించాలని కోరారు. భారాసలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు ఉమ్మడి వరంగల్‌కు చెందిన మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌పాటు, కరీంనగర్‌ నుంచి కూడా భారాస నేతలు తరలివచ్చి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు. అభ్యర్థులంతా ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ల ద్వారా ప్రతి ఓటరుకు చేరువ అయ్యేలా సాంకేతికతను వినియోగించారు. మరోవైపు సోమవారం పోలింగ్‌ కోసం ఆయా జిల్లాల అధికారులు సర్వం సిద్ధం చేశారు.  పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. 

48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్‌ 

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే:  పట్టభద్రుల ఉప ఎన్నికను పురష్కరించుకొని 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 4  నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలను ఎవరూ తెరువరాదన్నారు. ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని