logo

కన్నా.. అప్పుడే నిండు నూరేళ్లు నిండాయా?

నేల మీద నడిస్తే పాదాలు కందిపోతాయేమో అన్నంతా గారాబంగా మనవళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ నానమ్మ-తాత. పేద కుటుంబమే అయినా..రెక్కలు ముక్కలు చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు.

Published : 26 May 2024 05:30 IST

ప్రమాదవశాత్తు ఉరి పడి బాలుడి మృతి..

మనవడు సంపత్‌ మృతదేహాన్ని గుండెలకు హత్తుకొని రోదిస్తున్న తాత బుచ్చిరాములు 

జనగామ రూరల్, న్యూస్‌టుడే: నేల మీద నడిస్తే పాదాలు కందిపోతాయేమో అన్నంతా గారాబంగా మనవళ్లను కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ నానమ్మ-తాత. పేద కుటుంబమే అయినా..రెక్కలు ముక్కలు చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇంతలోనే విధి చిన్నచూపు చూసింది. పెద్ద మనవడు ప్రమాదవశాత్తు ఉరిపడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మనవడి మృతదేహాన్ని హత్తుకొని ఆ తాత గుండెలవిసేలా రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం గానుగుపహాడ్‌ గ్రామానికి చెందిన బండిరాజుల ఆంజనేయులు-అనిత దంపతులకు సంపత్‌ (11), గణేశ్‌ కుమారులు ఉన్నారు.  కుటుంబ పోషణ భారంగా మారడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్వగ్రామంలో ఉంచి హైదరాబాద్‌లో ప్రైవేటుగా పనులు చేస్తున్నారు. సంపత్‌ స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగు, గణేశ్‌ రెండో తరగతి పూర్తి చేశారు. నానమ్మ, తాత వజ్రమ్మ-బుచ్చిరాములు వారిని చూసుకుంటున్నారు. ఆంజనేయులు-అనిత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు, దుర్గామాత ఉత్సవాలకు 15 రోజుల కిందట గ్రామానికి వచ్చారు. దుర్గామాత ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సంపత్‌ శనివారం స్నానాల గదిలో సరదాగా ఆడుకుంటుండగా అక్కడ వేలాడుతున్న తాడుకు ప్రమాదవశాత్తు ఉరి పడి మృతి చెందాడు. సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై సృజన్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని