logo

ఆధ్యాత్మిక పర్యాటకానికి ఓరుగల్లు జై!

వేసవి సెలవులు కావడంతో విహారానికి వెళ్లాలని, హాయిగా సేద దీరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తరచూ సందర్శించే మన ప్రాంతాల్లోని యాత్రా స్థలాలు కాకుండా భిన్నంగా మరెక్కడికైనా వెళ్లాలనుకునేవారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను ఎంపిక  చేసుకుంటున్నారు.   

Updated : 26 May 2024 06:53 IST

అయోధ్య, అరుణాచలం, చార్‌ధామ్‌ యాత్రకు మొగ్గు 

‘ఆధ్యాత్మిక పర్యాటకం కోసం అంతర్జాలంలో శోధించే వారి శాతం ఈ వేసవిలో 103 శాతం పెరిగినట్టు ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ సర్వేలో తేలింది.’ 

వేసవి సెలవులు కావడంతో విహారానికి వెళ్లాలని, హాయిగా సేద దీరాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తరచూ సందర్శించే మన ప్రాంతాల్లోని యాత్రా స్థలాలు కాకుండా భిన్నంగా మరెక్కడికైనా వెళ్లాలనుకునేవారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలను ఎంపిక  చేసుకుంటున్నారు.


   స్నేహితులంతా భక్తిమార్గంలో 

స్నేహితులు గతంలో సరదాగా విహార యాత్రలకు వెళ్లేవారు. ఇప్పుడు తరచూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లి వస్తున్నారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటకు చెందిన ఎం.గణేశ్‌ నేతృత్వంలో స్నేహితులు పదిరోజుల కిందట ఉత్తరాఖండ్‌ పర్యటనకు వెళ్లారు.


అయోధ్య గొప్ప అనుభూతి ఇచ్చింది: తోట గణేశ్, వరంగల్‌

వరంగల్‌ నుంచి అయోధ్యకు ఇప్పటికి రెండుసార్లు వెళ్లొచ్చాం. మా కూతురు వైద్యురాలు. అయోధ్య రాముడి సేవలో పాల్గొంటున్నారు. సరయూ నదిలో లేజర్‌ ప్రదర్శన ఎంతో ఆహ్లాదం కలిగించింది.  

వీటికి మొదటి ప్రాధాన్యం.. 

ఉమ్మడి వరంగల్‌ యాత్రికుల సరళి చూస్తే సెలవుల్లో ఎక్కువగా అయోధ్య రామాలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, తమిళనాడులోని అరుణాచలం, మండువేసవిలో మంచుకొండల మధ్య ఆధ్యాత్మిక భావనతో పులకించిపోయేందుకు ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు చలో అంటూ భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. 

  • ఈ ఏడాది ప్రతిష్ఠ పూర్తయిన అయోధ్య రామాలయంతో పాటు సరయు నదిలో బోటింగ్, లేజర్‌షో, లతామంగేష్కర్‌ కూడలి లాంటివాటిని చూసి తరిస్తున్నారు. వారణాసి, నైమిశారణ్యం ప్రాంతాలను చూసి వస్తున్నారు. 
  • సాహస యాత్ర ఇష్టపడే వారైతే కాజీపేట నుంచి రైల్లో లేదా హైదరాబాద్‌ నుంచి నేరుగా విమానంలో దిల్లీకి వెళ్లి అక్కడి నుంచి ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి, బద్రినాథ్, కేదార్‌నాథ్‌ యాత్రలకు వెళుతూ మంచుకొండల్లో ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగితేలుతున్నారు. 
  •  ఇటీవల తమిళనాడులోని అరుణాచలానికి పెద్ద సంఖ్యలో వెళుతూ అక్కడ 14 కిలోమీటర్ల దూరం గిరిప్రదక్షిణం చేస్తూ భక్తి భావాన్ని చాటుతున్నారు. 
  •  మన తెలుగు రాష్ట్రాల్లోని తిరుమల, విజయవాడ, శ్రీశైలం, మహానంది, అహోబిలం లాంటి తీర్థయాత్రలకు మన వాళ్లు భారీగానే తరలివెళుతున్నారు. 

కుటుంబాలు కలిసి బస్సుల్లో వెళ్లి

బద్రినాథ్‌ ఆలయం ఎదుట డోర్నకల్‌ యాత్రికులు 

పది నుంచి పన్నెండు రోజుల పాటు అయోధ్య యాత్ర చేద్దామనుకునేవారు బస్సులు మాట్లాడుకుని కుటుంబాలతో కలిసి వెళుతున్నారు. ఒక్కో బస్సులో 40 మంది ప్రయాణించే వీలుంది. ఈ క్రమంలో కుటుంబాలు, స్నేహితులు, కాలనీవాసులు సమష్టిగా యాత్రలు చేస్తున్నారు. 

ట్రావెల్‌ ఏజెన్సీలకు డిమాండ్‌.. 

 త్రినగరి పరిధిలోనే 50 వరకు ట్రావెల్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి రోజుకు కనీసం 25 కార్లలో యాత్రికులు దక్షిణాది యాత్రలకు వెళుతున్నట్టు అంచనా. నగరంలో విమానం టికెట్లు బుక్‌ చేసే ఏజెన్సీలు పది వరకు ఉన్నాయి. వీటిల్లో రోజుకు 50 మంది వరకు దిల్లీ, తిరుపతి, వారణాసి, లక్నో తదితర ప్రాంతాలకు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నట్టు ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్‌ చెప్పారు. పెద్ద సంఖ్యలో నేరుగా ఆన్‌లైన్‌లోనే విమానం, రైలు టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు.  ః వేసవిలో తాము అయోధ్యకు అయిదు ట్రిప్పుల బస్సులు నడిపించామని హనుమకొండకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్ అనిల్‌ తెలిపారు. ః అరుణాచలంతోపాటు దక్షిణాది ఆధ్యాత్మిక ప్రాంతాలకు వారంలో ఒకటి రెండు కార్లు పంపుతున్నామని వరంగల్‌కు చెందిన యుగంధర్‌ చెప్పారు.

 బృందంగా తరలివెళ్లారు 

డోర్నకల్, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన 44 మంది యాత్రికులు బృందంగా ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లారు. కాలా యశోధర్‌ జైన్, మోనికా జైన్‌ నేతృత్వంలో ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఈ నెల 29న తిరిగి రానున్నారు. 

మానసిక ప్రశాంతత..

నర్సంపేట: నర్సంపేటకు చెందిన కిరాణా వ్యాపారులు వారం రోజుల పాటు గయా, బుద్ధగయ, వారణాసి, అలహాబాద్, అయోధ్య, నైమిశారణ్యం వంటి తీర్థ యాత్రలు వెళ్లి వచ్చారు. ఉత్తర భారతదేశంలో ముఖ్యమైన ఆలయాలను సందర్శించారు. తీర్థ యాత్రలతో ఆధ్యాత్మిక చింతన, మనసు ప్రశాంతత, మానసిక ఉల్లాసం, నూతనోత్తేజం కలిగిందని నర్సింహారెడ్డి, రామస్వామి తదితరులు తెలిపారు. 


హరిద్వార్‌ బాగా నచ్చింది 
- నాగిళ్ల వేణుశర్మ, మాణిక్యాపూర్‌

 ఇప్పటికే అయోధ్య, అరుణాచలం, కాశి లాంటి తీర్థయాత్రలకు వెళ్లొచ్చా. ఇప్పుడు చార్‌ధామ్‌ యాత్రలో ఉన్నా. హిమాలయాలను చూస్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతోంది. హరిద్వార్‌ నాకు బాగా నచ్చింది. 
 - న్యూస్‌టుడే, భీమదేవరపల్లి 


 హజ్‌యాత్రకు వందల సంఖ్యలో..

ఈ వేసవిలో ఓరుగల్లు నుంచి హజ్‌యాత్రకు తరలివెళ్లిన ముస్లిం సోదరుల సంఖ్య 300కు పైగా ఉంటుందని అంచనా. జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించి తరించిపోవాలనుకునే వారు విమానం ఎక్కి విదేశీ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లివస్తున్నారు. 
-ఈనాడు, వరంగల్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని