logo

చెరువుల పునరుద్ధరణకు కార్యాచరణ

 రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల ఆక్రమణలు, కాలుష్య నివారణ, వ్యర్థాలు తొలగించి, శుద్ధ జలాలు నిల్వ ఉండేలా చేయనున్నారు.

Published : 28 May 2024 03:06 IST

ఇరిగేషన్, రెవెన్యూ, గ్రేటర్‌ శాఖల ఆధ్వర్యంలో సర్వేకు ఆదేశాలు

భద్రకాళి చెరువులో అడవితుంగ

 రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయించింది. చెరువుల ఆక్రమణలు, కాలుష్య నివారణ, వ్యర్థాలు తొలగించి, శుద్ధ జలాలు నిల్వ ఉండేలా చేయనున్నారు. భూగర్భ జలాలు బలోపేతమయ్యేలా తగిన కార్యాచరణ రూపొందించనున్నారు. చెరువు గట్లు, బఫర్‌ జోన్‌ స్థలాల్లో మొక్కలు నాటి.. ఆహ్లాదం, ఆనందం కలిగే విధంగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వరంగల్‌ మహా నగర పరిధిలోని చెరువుల వాస్తవాలపై సమగ్ర సర్వే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకురాలు డి.దివ్య దేవరాజన్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ, గ్రేటర్‌ వరంగల్‌ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి, నెలరోజుల్లో సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

 -కార్పొరేషన్, న్యూస్‌టుడే

గ్రేటర్‌ పరిధిలో 200 వరకు..

  • కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) రూపొందించిన వరంగల్‌ నూతన మాస్టర్‌ ప్లాన్‌లో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో 200 చెరువులు, కుంటలు ఉన్నట్లుగా చూపించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కాజీపేట, హనుమకొండ, వరంగల్‌ త్రినగరాలతో పాటు 42 విలీన గ్రామాల్లో చెరువులు, కుంటల వివరాలు తీసుకున్నారు.
  • చెరువులు, కుంటలకు హద్దులు ఖరారు చేస్తారు. గరిష్ఠ సామర్థ్యం(ఫుల్‌ ట్యాంకు లెవల్‌-ఎఫ్‌టీఎల్‌) నిర్ణయించనున్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భవిష్యత్తులో నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల తొలగింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు.
  • నగర నడిబొడ్డున ఉన్న చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తగిన కార్యాచరణ రూపొందించనున్నారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా..

  • కాజీపేట బంధం చెరువు అక్రమార్కుల పరం అవుతోంది. 60 ఎకరాల ఆయకట్టుకు గాను ప్రస్తుతం కేవలం 20-25 ఎకరాలు ఉంది. అందులోకి మురుగునీరు చేరుతోంది. ఎఫ్‌టీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి.
  • హనుమకొండ పెద్ద వడ్డేపల్లి చెరువులోకి మురుగునీరు వస్తోంది. ఫుల్‌ ట్యాంకు లెవల్‌ హద్దులు పెట్టకపోవడంతో ఇష్టానుసారంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. చెరువులో వ్యర్థాలు తొలగించాలి.
  • భద్రకాళి చెరువు చుట్టూ బడా భవనాలు కడుతున్నారు. ఎఫ్‌టీఎల్‌ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. హనుమకొండ పద్మాక్షిగుట్ట, హంటర్‌రోడ్, ఎన్టీఆర్‌నగర్, సంతోషిమాత కాలనీల్లో నివాస గృహాలు వెలిశాయి. పద్మాక్షిగుట్ట వైపు నుంచి మురుగునీరు వస్తోంది. అడవి తుంగ తొలగించాలి. 
  • ములుగురోడ్‌ కోట చెరువు ఆక్రమించేస్తున్నారు. గౌతమినగర్, డాక్టర్స్‌ కాలనీ వైపు చెరువు లోపలికి వరకు నిర్మాణాలు వచ్చేశాయి. వరంగల్‌ ప్రాంతంలోని మురుగునీరంతా ఇందులోకి వస్తుంది. ఎఫ్‌టీఎల్‌ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు.
  • దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువులోనూ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. గణేశ్‌ నిమజ్జన అవశేషాలు, ఇతర వ్యర్థాలతో కాలుష్యం పెరిగింది. మురుగు పేరుకుపోయింది. అడవితుంగ తొలగించాలి.
  • ఉర్సు రంగసముద్రం(ఉర్సు చెరువు)లో అడవి తుంగ, వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగునీరు చేరుతోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని