logo

యమపాశాల్లా.. వేలాడుతున్నాయ్‌!

మండలంలో స్తంభాలు వంగిపోవడం, తీగలు తలకు తగిలేంత ఎత్తులో ఉన్నా సరి చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 28 May 2024 03:16 IST

తిమ్మంపేటలో.. 


ప్రమాదకరంగా ఉన్నా.. పట్టించుకోరేం?..

జఫర్‌గఢ్‌: మండలంలో స్తంభాలు వంగిపోవడం, తీగలు తలకు తగిలేంత ఎత్తులో ఉన్నా సరి చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిమ్మంపేటలో మల్లం రాములు, రాజాబోసు, ఎల్లయ్య, స్వామిలకు చెందిన వ్యవసాయ పొలం మీదుగా ఉన్న విద్యుత్తు తీగలు కిందికి ఉండటంతో, కోతల సమయంలో యంత్రాలు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు నిర్వహించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ నెల 20, 22 తేదీల్లో కోనాయచలం, కూనూర్‌లో నియంత్రిక సపోట్‌ వైరు తగిలి రెండు పశువులు చనిపోయాయి. తీగలు, నియంత్రికలను సరిచేయాల్సి ఉంది.

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో భారీ వానలు, ఈదురుగాలులకు విద్యుత్‌ ప్రమాదాలు, జీవాల మరణాలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రధానంగా వ్యవసాయ బావుల వద్ద నియంత్రికలకు ఎలాంటి రక్షణ కంచెలు, కరెంటు స్తంభాలు సక్రమంగా లేకపోవడంతో వేలాడే కరెంటు తీగలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఆదివారం కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు, విద్యుత్తు స్తంభాలు, హోర్డింగ్స్‌ కూలిపోయి 13 మంది దుర్మరణం చెందారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. వ్యవసాయ క్షేత్రాల్లోనే కరెంట్‌ తీగలు, దండేలా మాదిరి ఉండటం, ఒరిగిన విద్యుత్తు స్తంభాలు, ప్రమాదకర నియంత్రికలతో అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. రానున్న జూన్‌ నెల నుంచి వానాకాలం ప్రారంభం కానుండటంతో అధికారులు ఈ సారి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సోమవారం ప్రమాదకరమైన ప్రాంతాలను ‘న్యూస్‌టుడే’ పరిశీలించింది. 
- జనగామ టౌన్, న్యూస్‌టుడే


  చేయి ఎత్తులోనే తీగలు..

కొడకండ్ల: మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ నియంత్రికలు తక్కువ ఎత్తులో ఉండటంతో పశువులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. పది రోజుల కింద ఏడునూతుల గ్రామంలో యుగంధర్‌ అనే రైతుకు చెందిన రెండు పాడి పశువుల కాలికి విద్యుత్‌ తీగలు తగలడంతో మృతి చెందాయి. రామవరం, రామేశ్వరం, ఏడునూతుల, పడమటి తండ, రంగాపురం గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో తీగలు చేయికి అందేంత ఎత్తులోనే ఉన్నాయి. నియంత్రికలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేసి, స్తంభాలను సవరించి, తీగలను సరిచేయాలని కర్షకులు కోరుతున్నారు. 


 ఒరిగిన స్తంభం..

పాలకుర్తి: మండల కేంద్రంలో ఒరిగిన స్తంభాలు భయంకరంగా మారాయి. చాలా చోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఇలానే ఉండటంతో వర్షాకాలంలో మొత్తం విరిగి పోయి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే చెట్ల కొమ్మల మధ్యన ఉండే విద్యుత్తు తీగలు కనీసం గుర్తించకుండా మారాయి. ఈ నెల 13న గూడూరులో రైతు నర్సయ్యకు చెందిన ఒక దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. చెట్ల కొమ్మలను తొలగించి, స్తంభాలను సరిచేయాలి. ఒరిగిన స్తంభం..
పాలకుర్తి: మండల కేంద్రంలో ఒరిగిన స్తంభాలు భయంకరంగా మారాయి. చాలా చోట్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఇలానే ఉండటంతో వర్షాకాలంలో మొత్తం విరిగి పోయి ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అలాగే చెట్ల కొమ్మల మధ్యన ఉండే విద్యుత్తు తీగలు కనీసం గుర్తించకుండా మారాయి. ఈ నెల 13న గూడూరులో రైతు నర్సయ్యకు చెందిన ఒక దుక్కిటెద్దు విద్యుదాఘాతంతో మృతి చెందింది. చెట్ల కొమ్మలను తొలగించి, స్తంభాలను సరిచేయాలి.


పొంచి ఉన్న ముప్పు..

బచ్చన్నపేట: మండల కేంద్రం నుంచి పోచన్నపేట వెళ్లే రహదారిలో ఓ స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. అలాగే కొద్ది దూరంలో వైర్లు కూడా కిందికి వేలాడుతున్నాయి. బాగు చేయాలని రైతులు  కోరుతున్నారు.

కర్రలే ఊతంగా..

జనగామ రూరల్‌: గానుగుపహాడ్‌లో వ్యవసాయ బావుల వద్ద పలు చోట్ల 11 కె.వి విద్యుత్‌ లైన్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. గ్రామానికి చెందిన రైతులు ఉల్లి గట్టయ్య, ఎడమ యాదగిరి వ్యవసాయ బావుల వద్ద వైర్లు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో కర్రలను ఏర్పాటు చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. యంత్రాలు వచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. 


ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కరిస్తాం..  
- టి.వేణుమాధవ్, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ, జనగామ సర్కిల్‌

జిల్లాలోని వ్యవసాయ బావుల సమీపంలో కరెంటు స్తంభాల మధ్యన వేలాడే తీగలు ఉంటే, మిడిల్‌ పోళ్ల కోసం రైతులు సమీపంలోని విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయంలో సంప్రదిస్తే మధ్య స్తంభాలను ఏర్పాటు చేస్తాం. లేదా నేరుగా డివిజనల్‌ కార్యాలయం, ఎస్‌ఈ కార్యాలయంలో ఫిర్యాదులు అందిస్తే, సమస్యలను పరిష్కరిస్తాం. పశువులు మృతి చెందితే పంచనామా, ఎఫ్‌ఐఆర్‌ నివేదికలు సమర్పిస్తే, శాఖా పరంగా సాయం అందేలా కృషి చేస్తాం. రానున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని