logo

పుస్తకాలు సరే.. పంపిణీ ఎప్పుడో..?

సర్కారు బడులు, గురుకులాలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్య, నోటు పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని మండల కేంద్రాలకు ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది.

Published : 28 May 2024 03:24 IST

బడ్జెట్‌ లేక ప్రతిష్టంభన

 జంగేడులో గోదాంలో నోటు పుస్తకాలు 

న్యూస్‌టుడే, భూపాలపల్లి : సర్కారు బడులు, గురుకులాలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అవసరమయ్యే పాఠ్య, నోటు పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని మండల కేంద్రాలకు ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు పుస్తకాలు చేరవేసిన విద్యా శాఖ ఇక్కడ చేరుకున్న పుస్తకాలను మండల, పాఠశాల స్థాయిలో పంపేందుకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం ప్రధాన అవరోధంగా మారింది. జిల్లా కలెక్టర్‌ అత్యవసర నిధులను కేటాయిస్తే తప్ప గడువులోగా విద్యార్థులకు పుస్తకాలు చేరడం గగనంగా కనిపిస్తోంది.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు 450 వరకు ఉన్నాయి. దాదాపుగా 26 వేల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలో 1,96,110 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటివరకు 1,15,220 పుస్తకాలు జంగేడు ప్రభుత్వ పాఠశాలలోని గోదాంకు చేరాయి. బరువును తగ్గించేలా పార్ట్‌-1, పార్ట్‌-2లుగా విభజించి పుస్తకాలను విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. పార్ట్‌-1 పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలన్నీ రాజధాని నుంచి చేరుకోవడంతో వాటిని జిల్లా కేంద్రంలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని గోదాంలో నిల్వ చేశారు. ఈ సారి పాఠ్య పుస్తకాల బరువును దాదాపు 100 నుంచి 200 గ్రాముల మేర తగ్గించడమే కాకుండా వాటిపై ఆకర్షణీయ చిత్రాలు కనిపించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో నోటు పుస్తకాల ముఖ చిత్రంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని ముద్రించారు.

గోదాంలో నిల్వ

జిల్లా కేంద్రంలోని జంగేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదాంలో పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు నిల్వ చేశారు. విద్యార్థులకు ఇంకా సరిపడా పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని విద్యా సంస్థల్లో ఆరు నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. ఆరు, ఏడు తరగతులకు ఆరు నోటు పుస్తకాలు, 8వ తరగతికి ఏడు, 9,10 తరగతులకు 14, ఇంటర్‌ విద్యార్థులకు 12 చొప్పున అందజేస్తారు. 1వ నుంచి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలకు బదులు వర్క్‌బుక్‌లు ఇవ్వనున్నారు. 

ప్రతిసారీ లోటు బడ్జెట్టే..

బడులు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు చేరవేయాలని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో వాటిని సరఫరా చేసేందుకు అవసరమయ్యే నిధులను విడుదల చేయడం లేదు. రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు సకాలంలో చేరవేస్తున్నా అక్కడి నుంచి మండల విద్యా వనరుల కేంద్రం, ఆయా పాఠశాలలకు చేరవేయడంలో జాప్యం జరుగుతోంది. రూ.కోట్లు ఖర్చుపెట్టి పుస్తకాలను ముద్రిస్తున్న ప్రభుత్వం కీలకమైన పంపిణీ విషయంలో మాత్రం నిధులు ఇవ్వకపోవడంతో అసలైన లక్ష్యం నెరవేరకుండా పోతోంది. తామే రవాణా ఖర్చులు భరించాల్సి వస్తుందని పలువురు హెచ్‌ఎంలు వాపోతున్నారు.


బడులు తెరిచేలోగా పంపిణీ 
- రాంకుమార్, డీఈవో, భూపాలపల్లి

ప్రభుత్వ బడులు తెరిచేలోగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, గురుకులాలకు పాఠ్య, నోటు పుస్తకాలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. పాఠశాలల ప్రారంభం రోజున ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చేలా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పంపిణీ చేస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని