logo

నీటికుంట.. తీర్చును తంటా!

సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. ఆ నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నేలపై పడిన ప్రతి నీటిబొట్టును సంరక్షించాలని ప్రభుత్వం ఆశించి భూగర్భజలాలను పెంచేందుకు నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టింది.

Updated : 28 May 2024 06:51 IST

బీసీమర్రిగూడెం పరిధిలో పూర్తయిన పనులు  

వెంకటాపురం, న్యూస్‌టుడే: సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. ఆ నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నేలపై పడిన ప్రతి నీటిబొట్టును సంరక్షించాలని ప్రభుత్వం ఆశించి భూగర్భజలాలను పెంచేందుకు నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టింది. రైతుల భూములతో పాటు, అటవీ ప్రాంతాల్లోనూ జల సంరక్షణకు శ్రీకారం చుట్టింది. ఈ పనులతో కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. సాగు భూముల్లోనూ రైతులకు పైసా ఖర్చు లేకుండా ఈ నిర్మాణాలపై దృష్టి సారించింది. ములుగు జిల్లాలోనే వెంకటాపురం మండలంలో ప్రయోగాత్మకంగా కొత్త పనులను చేస్తోంది.

ఎకరం నుంచి రెండెకరాల్లో 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక్కో నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. ఎకరం నుంచి రెండెకరాల విస్తీర్ణం కలిగిన రైతుల భూముల్లో ఈ నిర్మాణాలకు రూపకల్పన చేశారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్మాణాన్ని మంజూరు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోనూ భూగర్భజలాలను ఇంకించేందుకు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏ ప్రదేశంలో నిర్మిస్తే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నిల్వ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అటవీ జంతువులతో పాటు పశువులు, పక్షులకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 

గ్రామసభల ఆమోదంతోనే..

మండల వ్యాప్తంగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆసక్తి ఉన్న ప్రాంతాలైన ఎదిర, ఆలుబాక, బోదాపురం, పాత్రాపురం, బీసీమర్రిగూడెం, మరికాల, వెంకటాపురం పంచాయతీల పరిధిలో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు 46 నీటి కుంటల నిర్మాణాన్ని నిర్దేశించగా, ఇప్పటికే 15 పూర్తయ్యాయి. మరో 25 చోట్ల కొనసాగుతున్నాయి. ఈ పనులకు ముందస్తుగానే గ్రామసభల తీర్మానం, ఆమోదంతోనే ప్రభుత్వం ఉపాధి నిధులను కేటాయిస్తోంది. 

కూలీల ఉపాధికి ఊతం

నీటి కుంటలు, చిన్న నీటి కుంటల నిర్మాణాలతో కూలీల ఉపాధికి ఊతమిస్తోంది. చెరువులు, కాలువల పూడిక తొలగిస్తే క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.194 ప్రభుత్వం చెల్లిస్తుండగా, అదే కొత్తగా చేపడుతున్న కుంటల నిర్మాణాల్లో శ్రమిస్తున్న కూలీలకు క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.333 వేతనం చెల్లిస్తున్నారు. దీంతో ఈ  పనులపై కూలీలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వెంకటాపురం మండల వ్యాప్తంగా 6,105 జాబ్‌కార్డులు జారీ చేయగా, 10,476 మంది కూలీలు నమోదయ్యారు. ఇందులో 3,842 మంది కూలీలు శ్రమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 


సద్వినియోగం చేసుకోవాలి
- భవానీ, ఏపీవో, వెంకటాపురం

ఉపాధి పథకంలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. రైతులు, కూలీలకు ఈ పనులు ఉపయోగకరంగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన రైతులు దరఖాస్తు చేసుకుంటే నివేదిస్తాం. నయాపైసా ఖర్చు లేకుండానే నీటి సంరక్షణ పనులు పూర్తి చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని