logo

చిట్టితల్లికి ఆసరా ఎవరు?

ఆ తల్లి అనాథ బాలికను చేరదీశారు.. అన్నీ తానై కన్నతల్లిలా పెంచుతోంది. విధి వక్రీకరించి అనారోగ్యంతో ఆ తల్లి సోమవారం మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి మళ్లీ ఒంటరి అయ్యారు

Updated : 28 May 2024 06:52 IST

తల్లి మృతితో మళ్లీ అనాథలా మారిన బాలిక 

దీనంగా చూస్తున్న మానస 

కురవి, న్యూస్‌టుడే: ఆ తల్లి అనాథ బాలికను చేరదీశారు.. అన్నీ తానై కన్నతల్లిలా పెంచుతోంది. విధి వక్రీకరించి అనారోగ్యంతో ఆ తల్లి సోమవారం మృతి చెందింది. దీంతో ఆ చిన్నారి మళ్లీ ఒంటరి అయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవిలో సోమవారం చోటుచేసుకుంది.. మండల కేంద్రానికి చెందిన ధర్మవరం శశిరేఖ(62) భర్త రామస్వామి దంపతులు. వీరికి సంతానం లేదు. 25 ఏళ్ల కిందట రామస్వామి మృతి చెందారు. శశిరేఖ కూరగాయలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తూ..  కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులు లేని శిశువును తెచ్చి పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ బాలిక మానస స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శశిరేఖకు సొంత ఇల్లు లేకపోవడంతో కురవి- మరిపెడ 365 జాతీయ రహదారి పక్కనే రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. కొన్ని రోజుల కిందట శశిరేఖ హైదరాబాద్‌లోని తమ సోదరి దగ్గరికి కుమార్తెతో కలిసి వెళ్లారు. అక్కడ జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లి సోమవారం మూడు గంటలకు హైదరాబాద్‌ నుంచి కురవికి ఆటోలో వస్తున్నారు. మార్గంమధ్యలో తీవ్ర అస్వస్థతకు గురై ఆమె మృతిచెందగా.. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు లేని తనను పెంచిన తల్లి కూడా మృతి చెందడంతో ఆ బాలిక కన్నీరు మున్నీరైంది. తల్లి మృతదేహం వద్ద ఒంటరిని చేసి వెళుతున్నావా అమ్మా.. అంటూ రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది. బంధువులు ఉన్నా.. ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని