logo

ఫిర్యాదు.. ఆలస్యమైతే వ్యర్థమే..!

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత చరవాణి ద్వారా పనులన్నీ పూర్తవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

Updated : 28 May 2024 06:50 IST

సైబర్‌ మోసాల్లో తక్షణం స్పందిస్తే రికవరీకి అవకాశం

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత చరవాణి ద్వారా పనులన్నీ పూర్తవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు కొత్త పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఖాతాల్లో నుంచి క్షణాల్లో డబ్బులు మాయం చేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లను అదుపు చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండాపోతుంది. ఇటీవల నూతనంగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే కొంతమేరకు పోయిన డబ్బులను తిరిగి రాబట్టేందుకు అవకాశం ఉంది. మూడునెలల క్రితం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో సైబర్‌ ఠాణాను ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ మోసాలను ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నారు. సైబర్‌ మోసం జరిగిందని గుర్తించిన వెంటనే బాధితులు 1930కు కాల్‌ చేసి వివరాలు తెలియజేయాలి. సాధారణ ప్రజలతో పాటు విద్యావంతులు, వైద్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సైబర్‌ నేరగాళ్ల బారినపడుతున్నారు.

పరువు పోతోందని..

 చాలామంది పరువు పోతుందని బయటకు చెప్పడం లేదు. రెండురోజుల క్రితం సైబర్‌ నేరగాళ్లు వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్య ఫొటోను డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌)గా పెట్టి డబ్బులు డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన సైబర్‌ విభాగం దానిని నిర్వీర్యం చేసింది. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నవారే ఎక్కువగా సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. సైబర్‌ ఠాణా ఏర్పాటైనప్పటి నుంచి వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో 15 కేసుల్లో సుమారు రూ.3 లక్షలు తిరిగి బాధితులకు ఇప్పించారు. చాలామంది ఆలస్యంగా ఫిర్యాదు చేస్తుండటంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు.

ఇలా చేస్తే మోసపోతారు..!

ః చరవాణి వాట్సప్‌ నెంబర్లకు గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింక్‌లను క్లిక్‌ చేయొద్దు. ః సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం కుటుంబ విషయాలపై పోస్టులు పెట్టొద్దు. ః వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు, చరవాణికి వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దు. ః పార్ట్‌టైం ఉద్యోగాలు ఇస్తామని గుర్తుతెలియని వ్యక్తులు నుంచి వచ్చే ఫోన్లను నమ్మి వివరాలు ఇవ్వొద్దు. ః ఇన్‌స్టాంట్‌గా(వెంటనే) రుణాలు ఇస్తామని చెప్పి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతారు.  ః వలపు వల విసిరి సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని మోసం చేస్తారు.  ః సీబీఐ, నార్కొటిక్‌ విభాగం, కస్టమ్స్‌ అధికారులమంటూ.. ఫోన్‌ చేసి మీపేరుతో డ్రగ్స్‌ వచ్చాయి అంటూ వీడియో కాల్‌ చేసి బెదిరింపులకు పాల్పడతారు. బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని తనిఖీలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారు.  ః క్రెడిట్‌కార్డు ఇస్తామని చరవాణికి ఫోన్లు చేస్తారు. వాటిని తిరస్కరించాలి. 

ఇటీవల జరిగిన ఘటనలు

  •  వరంగల్‌కు చెందిన వ్యక్తి ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి సుమారు రూ.లక్ష పోగొట్టుకున్నాడు. వెంటనే సైబర్‌ ఠాణాకు ఫిర్యాదు చేస్తే వారు రూ.22 వేలను సీజ్‌ చేశారు. ఆ మొత్తం తిరిగి బాధితుడికి ఇప్పించారు.
  • జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి సైబర్‌ నేరగాళ్ల బారినపడి రూ.2.10 లక్షలు మోసపోయాడు. ఫిర్యాదు చేయడంతో రూ.27 వేలు పోలీసులు సీజ్‌ చేసి      బాధితుడికి అందించారు. 

    అప్రమత్తంగా ఉండాలి 

- సైబర్‌ విభాగం ఏసీపీ విజయ్‌కుమార్‌ 

అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతాల వివరాలను చెప్పొద్దు. చరవాణిలో గాని, పేపర్లపై గాని వివరాలు రాయొద్దు. విశ్రాంత ఉద్యోగులు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌ నేరగాళ్లకు చిన్న అవకాశం ఇచ్చినా డబ్బులను మాయం చేస్తారు. వెంటనే ఫిర్యాదు చేస్తే నగదు బ్యాంకుల్లోనే ఫ్రీజ్‌ చేసే అవకాశం ఉంటుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని