logo

భానుడితో పోటీ పడుతూ.. పట్టభద్రులు ఓటెత్తారు!

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా సోమవారం ఎండలు భగ్గుమన్నా పట్టభద్రులు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి ఓటేశారు.

Published : 28 May 2024 04:19 IST

ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా సోమవారం ఎండలు భగ్గుమన్నా పట్టభద్రులు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి బారులు తీరి ఓటేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే 34 డిగ్రీలతో మొదలైన 43 డిగ్రీల మధ్య నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నట్టు.. పోలింగ్‌ శాతం రెండు గంటలకోసారి పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 నుంచి 10 గంటల  వరకు 11.40 శాతంతో మొదలైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు 72.66 శాతానికి చేరుకొంది. 

వరంగల్‌ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల పరిధిలో ఒకటి రెండు చోట్ల చిన్న ఘటనలు మినహా ఎక్కడా  ఇబ్బంది ఎదురు కాలేదు. అన్ని చోట్ల పట్టభద్రులు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటేశారు. తొలిసారి ఓటు హక్కు పొందినవారు ఉత్సాహంగా ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. 

రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో..

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఆరు జిల్లాల్లో మొత్తం పట్టభద్ర ఓటర్లు 1,68,727 ఉండగా.. సోమవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు 1,21,230 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 72.66 శాతం.  
  2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.82 శాతం పోలింగ్‌  నమోదైంది. ప్రాథమిక సమాచారం ఆధారంగా  4.16 శాతం తక్కువ నమోదైంది. పూర్తి వివరాలు  వచ్చాక  పెరిగే అవకాశం ఉంది. 

ముఖ్యాంశాలు.. 

  • 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌లో  జనగామలో అత్యధిక శాతం పట్టభద్రులు ఓటేశారు. ఇప్పుడు కూడా జనగామ జిల్లానే ఓటింగ్‌లో ముందంజలో ఉంది. 
  • సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఓరుగల్లు నగరంలోనూ పోలింగ్‌ శాతం పెరిగింది. 
  • భాజపా, భారాస, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, తీన్మార్‌ మల్లన్న వరంగల్‌ నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.
  • పోలింగ్‌ ముగిసే సమయం సాయంత్రం 4 గంటలకల్లా వరుసలో ఉన్న వారందరికీ ఓటేసేందుకు అవకాశం ఇవ్వడంతో అనేక చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరిగింది.
  • వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల కలెక్టర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • బ్యాలెట్ పెట్టెలన్నీ గట్టి పోలీసు బందోబస్తు నడుమ నల్గొండకు తరలించారు. లెక్కింపు ప్రక్రియ అక్కడే జరుగుతుంది. ఫలితాలు జూన్‌ 5న వెలువడుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని