logo

మదినిండా తల్లుల నామస్మరణ

శరణు శరణు తల్లులారా.. కరుణించండి.. మీ చెంతకు చేరాం.. మీ దర్శనమే మహాభాగ్యం.. అంటూ వనజాతరకు వచ్చిన భక్తులు అమ్మలను    తలచారు.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించారు.

Published : 03 Feb 2023 06:28 IST

ఒడిబియ్యంతో మహిళ

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, తాడ్వాయి, మంగపేట, న్యూస్‌టుడే: శరణు శరణు తల్లులారా.. కరుణించండి.. మీ చెంతకు చేరాం.. మీ దర్శనమే మహాభాగ్యం.. అంటూ వనజాతరకు వచ్చిన భక్తులు అమ్మలను    తలచారు.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించారు. వనమంతా భక్తజనం నిండిపోవడంతో మేడారం మురిసింది. సమ్మక్క, సారలమ్మ చిన్న జాతరకు గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు తరలొచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.


పాదాలు తాకేందుకు పొర్లుదండాలు

నీ పాద స్పర్శతో పునీతులమవుతాం అంటూ పొర్లు దండాలు పెడుతూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. సమ్మక్క తల్లి పూజాసామగ్రిని నెత్తిన ఎత్తుకుని గుడికి వెళ్తున్న క్రమంలో పూజారుల పాద స్పర్శ కోసం భక్తులు పోటీపడి పొర్లు దండాలు పెట్టారు. డోలు చప్పుళ్లు, కొమ్ము బూరల సంగీతం, జై సమ్మక్క తల్లీ అనే నినాదాలతో మేడారం మారుమోగింది. గ్రామ మహిళలు నిండు బిందెలతో నీళ్లను ఆరబోసి అమ్మవార్లకు మొక్కుకున్నారు. సారలమ్మ పూజారులు అమ్మవారి పూజాసామగ్రిని ఆలయానికి తీసుకెళ్లారు. డేరాలను ఆలయాల్లో భద్రపర్చారు. అనంతరం పూజారులు కుటుంబసభ్యులు, బంధువులతో కలసి పూజలు చేశారు.


గద్దెల నుంచి ఆలయాలకు అడేరాలు

మండమెలిగే పండగను ఆదివాసీ సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి పూజారులు అమ్మవార్ల పూజా సామగ్రి అడేరాలను గద్దెకు చేర్చగా.. విద్యుద్దీపాలను ఆర్పివేసి పూజారులు శాంతి, రహస్య పూజా కార్యక్రమాలను నిర్వహించి గద్దెల ప్రాంగణంలోనే జాగరణ చేశారు. గురువారం ఉదయం గద్దెల ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. డోలు వాయిధ్యాలతో గద్దెల నుంచి అమ్మవార్ల పూజా సామగ్రిని తీసుకెళ్లారు. ఈ వేడుక ఎంతో ఆడంబరంగా సాగింది. సమ్మక్క పూజారులు సిద్ధబోయిన జగ్గారావు, ముణీందర్‌, లక్ష్మణ్‌రావు, కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కిరణ్‌కుమార్‌, తదితర, పూజారులు పాల్గొన్నారు.


దర్శనానికి వెళ్తున్న యువతి


సమ్మక్క అడేరాలు తీసుకెళ్తుండగా పొర్లుదండాలు పెడుతున్న భక్తులు


జంపన్నవాగులో జలకాలాట


స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు