logo

ములుకనూర్‌ డెయిరీ దేశానికే ఆదర్శం

దేశానికి ములుకనూర్‌ మహిళా సహకార డెయిరీ ఆదర్శమని, ఈ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా డెయిరీలు విస్తరించేందుకు కృషి చేస్తామని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వీనేష్‌షా తెలిపారు.

Published : 30 Mar 2023 04:39 IST

డెయిరీలో పాల ప్యాకెట్ల తయారీని పరిశీలిస్తున్న ఎన్‌డీడీబీ ఛైర్మన్‌ మీనేష్‌షా

భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: దేశానికి ములుకనూర్‌ మహిళా సహకార డెయిరీ ఆదర్శమని, ఈ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా డెయిరీలు విస్తరించేందుకు కృషి చేస్తామని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వీనేష్‌షా తెలిపారు. బుధవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూర్‌ డెయిరీలో జరిగిన ‘గడ్డి గింజల ఉత్పత్తి, పంపిణీ‘ కార్యక్రమానికై హాజరయ్యారు. లక్షన్నర లీటర్ల సామర్థ్యం కలిగిన పాల ప్యాకెట్లు, పాల పదార్థాల తయారీ ప్లాంట్లను సందర్శించారు. అనంతరం డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. పాల దిగుబడుల్లో మహిళల పాత్ర కీలకమని, వారికే పాల బిల్లులు ఇస్తుండటంతో ప్రగతి సాధ్యమైందన్నారు. దిగుబడులు పెంచేందుకు సాంకేతికంగా, ఆర్థికంగా చేయూత అందిస్తామన్నారు. రెండేళ్లుగా డెయిరీ పరిధిలో 500ఎకరాలలో రైతులు పశుగ్రాస విత్తనోత్పత్తి చేపట్టారన్నారు. మొక్కజొన్న, జొన్న విత్తనోత్పత్తి చేపట్టి దేశానికి విత్తనాలు ఎగుమతి చేసే స్థాయి డెయిరీ ఎదిగిందని కితాబు ఇచ్చారు. దాణా పరిశ్రమ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ కోసం మహిళా డెయిరీకి రూ.1.03కోట్ల ప్రోత్సాహం, అందులో రూ.57.15లక్షల రాయితీని ప్రకటించి నిధుల మంజూరు పత్రం అందజేశారు. జీఎం భాస్కర్‌రెడ్డి, ఎన్‌డీబీబీ ప్రాంతీయ అధికారి రాజీవ్‌, రాష్ట్ర ఇన్‌ఛార్జి మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని