logo

నీటి గోస వినేదెవరు?

రోజూ తాగునీటి సరఫరా కలగానే మిగిలింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా అడుగులు పడటం లేదు. కార్యాలయాల్లో సమావేశాలు, సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

Updated : 31 Mar 2023 05:57 IST

న్యూస్‌టుడే, కార్పొరేషన్‌:  రోజూ తాగునీటి సరఫరా కలగానే మిగిలింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా అడుగులు పడటం లేదు. కార్యాలయాల్లో సమావేశాలు, సమీక్షలు తప్ప క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పాలకవర్గం పెద్దలు, అధికారులు కదలడం లేదు. ఎండా కాలం మొదలైంది. తాగునీటి అవసరాలు పెరిగాయి. సరిపడా తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత గ్రేటర్‌ వరంగల్‌దే. పాలకవర్గం, ఇంజినీర్లు పట్టింపు లేకుండా ఉన్నారని ప్రజలు వాపోతున్నారు. సోమవారం ప్రజావాణిలో నీటి సరఫరాపై 9 ఫిర్యాదులు వచ్చాయి. తాగునీళ్లు ఇవ్వండని అధికారులను వేడుకున్నారు. రెండు, మూడు వారాలుగా సరఫరా అస్తవ్యస్తంగా మారినా ఎవరికీ పట్టడం లేదు. మేయర్‌ సుధారాణి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో అంతా బాగుందని ఇంజినీర్లు చెబుతున్నారు. కాలనీల్లో చూస్తే పరిస్థితి మరోలా ఉంది. కలుషితమైన నీళ్లు వస్తున్నాయని, పాత నల్లాలు ఆకస్మాత్తుగా బంద్‌ చేయడం, మిషన్‌ భగీరథ నీళ్లు సరిగ్గా రావడం లేదని ప్రజలు వివరించారు.

మానిటరింగ్‌ సెల్‌ పనిచేస్తుందా?

నగరంలోని 66 డివిజన్లలో తాగునీటి సరఫరా తీరును తెలుసుకునేందుకు మానిటరింగ్‌ సెల్‌ ప్రారంభించారు. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, చివరి ఇంటికి నీటి సరఫరా జరిగిందీ లేనిదీ అడిగి తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం నెరవేరడం లేదు. రోజూ ఎవరితో మాట్లాడుతున్నారు? సమస్యలేమిటనేది ఎవరికీ తెలియదు. క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేయాల్సిన కొందరు డీఈ, ఏఈలు నీటి సరఫరాను పట్టించుకోవడం లేదు.


ఇవిగో ఉదాహరణలు

* హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో నీటి సరఫరా లేదు. కొత్తూరు జెండా, కుమార్‌పల్లి, రెడ్డికాలనీల్లో కలుషితమైన నీళ్లు వస్తున్నాయి.
* వరంగల్‌ వేణురావు కాలనీ, మండిబజారు, రామన్నపేట, పాపయ్యపేట, సంతోషిమాత కాలనీ, ఉర్సు, రంగశాయిపేట ప్రాంతాల్లో నల్లాల ద్వారా రంగు మారిన నీళ్లు వస్తున్నాయి.
* మేయర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్‌లో పలు కాలనీలకు నీటి సరఫరా ఆగింది. రామన్నపేట పెద్దమోరీ పనుల కోసం పైపులు తవ్వి వదిలేశారు. శివనగర్‌ పల్లవి ఆసుపత్రి లైన్‌లో నీటి సరఫరా పునరుద్ధరించ లేదు.
* 40వ డివిజన్‌ ఉర్సు సుభాస్‌నగర్‌, బొడ్రాయి, కుమ్మరివాడ, ప్రతాప్‌నగర్‌ తదితర కాలనీల్లో పాత నల్లాల ద్వారా సరఫరా ఆపేశారు. మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరావు అవుతున్న లీకేజీలతో కలుషితమైన నీరు వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
*41, 42వ డివిజన్‌ ఉర్సు పార్కు, రంగశాయిపేట, కాపువాడ, ఎస్సీ కాలనీ, శంభునిపేట ప్రాంతాల్లో నీటి సరఫరా క్రమం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని