logo

రండి ఓటేద్దాం..

ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది.

Published : 30 Nov 2023 03:27 IST

పోలింగ్‌ కేంద్రం పిలుస్తోంది

ఈనాడు, మహబూబాబాద్‌ : ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే సమయం వచ్చేసింది.. రండి ఓటేద్దాం. మన ఆస్తి అయిన ఓటు హక్కు వినియోగించుకునేందుకు చక్కటి అవకాశం ఈ రోజు వచ్చింది. ఇందుకు కన్నతల్లిలాంటి పల్లె ఎక్కడున్నా రమ్మంటోంది. పండగలకు సొంతూరులో ఏవిధంగా వాలిపోతామో అలాగే గురువారం ఊరిలో జరిగే ఓట్ల పండగలో పాల్గొనేందుకు ప్రతి ఓటరూ తప్పకుండా రావాలని పిలుస్తోంది. ఈ రోజు సెలవు కదా.. అని ఇతర పనులు ఏమి పెట్టుకోకుండా ఓటేసి పొమ్మంటోంది ఊరు.

అడవి, ఎడారి బిడ్డలను స్ఫూర్తిగా తీసుకుందాం

మనకంటే ముందుగా పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో, దూరంగా ఉన్న ఎడారి రాష్ట్రంగా పిలిచే రాజస్థాన్‌లో పోలింగ్‌ జరిగింది. అడవి బిడ్డలున్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటన్నింటిని దాటుకుని మన్యం బిడ్డలు ఓటేశారు. రాజస్థాన్‌లోనూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల బాట పట్టారు. 75.45 శాతం మంది ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఆ రెండు చోట్ల కంటే మన దగ్గర పరిస్థితులు భిన్నం.. అన్ని వసతులన్నాయి.. కూత వేటు దూరంలోనే పోలింగ్‌ కేంద్రాలుంటాయి. అయినా ఓటు వేసేందుకు వెనుకంజలో ఉంటున్నారు. ఈసారి పై రెండు రాష్ట్రాలను స్ఫూర్తిగా తీసుకుని 2018లో నమోదైన 82.59 శాతానికి మించి నమోదయ్యేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరుదాం.

ఛత్తీస్‌గఢ్‌ ఆదర్శం.. : ఛత్తీస్‌గఢ్‌ మన పొరుగు రాష్ట్రం.. మావోయిస్టుల బెదిరింపులు వచ్చినా.. పోలింగ్‌ కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో ఉన్నా.. సరైన రవాణా వ్యవస్థ లేకున్నా వాటన్నింటిని అధిగమించి మన్యం బిడ్డలు ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఆ రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు రెండు విడతల్లో నిర్వహించిన పోలింగ్‌లో 76.31 శాతం ఓటర్ల తమ హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

దేశం నలుమూలల నుంచి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన చాలా మంది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి రీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. వీరంతా సొంతూర్లకు బయలుదేరారు. విదేశాల్లో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐలు సైతం ప్రత్యేకంగా ఓటు వేయడానికి వచ్చారు. దూరప్రాంతాల వారే ఓటు వినియోగంపై మక్కువ చూపిస్తుంటే సమీపంలోని, ఇతర జిల్లాలు, రాజధానిలో ఉన్న వారు స్వస్థలాలకు వచ్చి ఓటేసి సత్తాచాటాలి.

యువత ఓటు బాటపట్టాలి

ఎన్నికల సంఘం అక్టోబరు 4న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 12 నియోజకవర్గాల్లో 18 నుంచి 39 ఏళ్ల వారు 14,00,257 మంది ఉన్నారు. దీనికి తోడు ఈ నెల 11న ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో 81,708 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరిలోనూ యువ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరిలో చాలా మంది విద్య, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వెళ్లిన వారుంటారు. వీరందరూ ఓటేసేందుకు సొంతూరికి వస్తే పోలింగ్‌ శాతం మరింత పెరుగుతుంది.


న్యూజెర్సీ నుంచి వచ్చా

- ఎం.బుచ్చిబాబు, అయోధ్య, మహబూబాబాద్‌

పదేళ్ల కిందట న్యూజెర్సీకి వెళ్లాను. అక్కడ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన కొద్ది రోజులకే సొంతూళ్లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. నాతో పాటు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన పది మంది స్నేహితులం కలిసి వచ్చాం. ఓటు హక్కు అనేది మన భవిష్యత్తును నిర్ణయించేది. మంచి పనులు చేసే నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లందరూ పోలింగ్‌ రోజున ఎన్ని పనులున్నా తప్పకుండా తమ ప్రాంతానికి వచ్చి ఓటేసి పోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని