logo

నేను మీ ఓటును.. నన్ను గెలిపించండి

ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును.

Published : 30 Nov 2023 03:37 IST

ప్రజాస్వామ్యానికి నేను గుండెకాయ అంటారు. ప్రజల చేతిలో నన్ను వజ్రాయుధం అని కీర్తిస్తారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించి వారి తలరాత రాసే బ్రహ్మగా అభివర్ణిస్తారు. మీకు 18 ఏళ్లు నిండితేగానీ నన్ను అందుకోలేరు. ఇంతకీ నేనెవరో తెలిసిందా? ఈ రోజు మీరు వేయబోయే ఓటును. మీతో ఓ మనవి చేసుకుందామని చలిలో మంచు కురిసేవేళ ఇలా వచ్చా. మిమ్ముల్ని వేడుకునేదేంటంటే.. దయచేసి నన్ను ఓడించకండి. నాపై గౌరవంతో నన్ను గెలిపించండి..

ఈనాడు, వరంగల్‌,  డోర్నకల్‌, న్యూస్‌టుడే


మీ ‘మార్కు’ చూపండి

అప్పుడు యువత నన్ను గెలిపించినట్టు.

పట్టణాలు, నగరాల్లో నా విలువ గుర్తించడానికి తక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గత ఎన్నికల్లో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్‌ కేవలం 58.29 శాతం. 2014లో 57.55 శాతమే. పోలింగ్‌ రోజు సెలవు ఉందని యువత ఆసక్తి చూపకపోవడం వల్ల ఓటింగ్‌ తగ్గుతోంది. చదువుల్లో పోటీపడి 90 శాతం పైగా మార్కులను తెచ్చుకుందామని చూస్తారు..అదే స్ఫూర్తి నన్ను సంధించడంలో కూడా చూపండి. అత్తెసరు శాతం పోలింగ్‌ కాకుండా ‘మీ మార్కు’ చూపి నగరాల్లో కూడా 80 నుంచి వందకు చేరేలా ఓటు వేయండి.


సెలవు అర్థం అది కాదు

సెలవు తీసుకొని ఓటేయకపోతే నేను ఓడిపోయినట్టు

పండగలకు ఇచ్చినట్టే నా ‘ఓటు పండక్కి’ కూడా ప్రభుత్వం సెలవు ఇవ్వడం సంతోషంగా ఉంది. కొందరి తీరు చూస్తుంటే బాధ కలుగుతోంది. కార్యాలయాలకు సెలవు ఇచ్చారని సినిమాలు,  పర్యటనలకు వెళ్తున్నారు. సెలవు ఇచ్చింది ఓటేయడం కోసమని మరవొద్దు. పోలింగ్‌కు ఒకరోజు ముందు హనుమకొండ బస్టాండ్‌ కిటకిటలాడింది. వారంతా ఓటేయడానికి తమ సొంతూళ్లకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అలా మీరంతా కూడా ఈ రోజు మొదట ఓటేశాకే సినిమాలు, షికార్లు మరే పనైనా.


ఇదీ నా బలగం

నిజాయతీపరులు ఎన్నికైతే నేను గెలిచినట్టు.

ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో నా బలగం చూస్తే చాలా ఆనందంగా ఉంది. పురుష ఓటర్లు 14,68,775 మంది కాగా, మహిళలు 15,05,252. ఇతరులు 467. మగవారి కన్నా మహిళా ఓటర్లు 36,477 మంది అధికంగా ఉన్నారు. మొత్తం   29,74, 494 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా నేడు నా కోసం సమయం వెచ్చించాలి. ఎవరో వారి స్వార్థం కోసం చెప్పిన వారికి కాకుండా, మీ ఊరి వారు, మీ సామాజిక వర్గం వారనో కాకుండా, సుపరిపాలన అందించే వారు, ప్రజా జీవితం గడిపేవారు. మంచి వ్యక్తిత్వంగల వారికి ఓటు వేయండి..


నడుచుకుంటూ ఇంటికొచ్చా

వారి స్ఫూర్తితో మిగతా వారు ఓటేస్తే నేను గెలిచినట్టు.

ఓటుగా నా లక్షణాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఎక్కువ మందికి చేరువయ్యేందుకు ఎంతో శ్రమిస్తున్నా. ఈసారి కదల్లేని స్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి కోసం నేను వారి ఇళ్లకే వెళ్లి వారి చేతిలో వజ్రాయుధంగా మారా. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో మీ చెంతకొచ్చి మిమ్ముల్ని అక్కున చేర్చుకున్నా. మీ ఆదరాభిమానానికి మురిసిపోయా. 80 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు వారి శరీరాలు సహకరించకపోయినా ఓపిక చేసుకుని మరీ నన్ను సంధించారు. మరి మీ చేతులు, కాళ్లూ అన్నీ బాగున్నాయి. వయసు సహకరిస్తోంది. మరి ఆలస్యమెందుకు?


దయచేసి అవి వద్దు

‘వజ్రాయుధం లాంటి నన్ను తాయిలంగా వాడుకుంటే నేను  ఓడినట్టు.

వరంగల్‌ ముద్దు బిడ్డ ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు. ‘అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటి వాడోనని చూడు’ అన్నారు ఆయన. ఎన్నికల్లో నిలబడే వారి వ్యక్తిత్వం, ప్రజాసేవ తదితర అంశాలు పరిశీలించండి. డబ్బు ఇస్తున్నారో, మద్యం పోస్తున్నారనో, కానుకలు ముట్టజెబుతున్నారనో, మరేదైనా తాయిలం ఇచ్చే వారివైపు మొగ్గితే నన్ను మీరు తాకట్టు పెట్టినట్టే. ప్రజాస్వామ్య గుండెకాయనైన నన్ను ఎవరైనా డబ్బుకు అమ్ముతారా? ప్రలోభ పర్వానికి దూరంగా ఉండి స్వేచ్ఛగా నిజాయతీగా మీకు ఇష్టమైన అభ్యర్థి కోసం నన్ను ఉపయోగించుకుంటే ఎంతో సంతోషిస్తా.


మరి మీరంతా నన్ను గెలిపిస్తారుగా..

‘పార్టీ అభ్యర్థులను గెలిపించేది.. ఓడించేది నువ్వే.. మరి పోలింగ్‌ రోజు  ఈ ప్రచారం ఏంటి?’ అని అనుకోకండి..పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి నన్ను గెలిపించేందుకు పైన చెప్పినట్టు నన్ను సంధించండి. మీ వేలికున్న సిరా చుక్క చూసి నేను మురిసిపోతా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని