logo

ఉచ్చులో ఎలుగుబంటి

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్‌ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్‌కు తరలించారు.

Published : 30 Nov 2023 03:39 IST

తప్పించుకున్న మరో రెండు

వర్ధన్నపేట, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట శివారులో బుధవారం ఎలుగుబంట్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్‌ నుంచి వచ్చిన అటవీ అధికారులు తమ సిబ్బందితో సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి ఒక ఎలుగుబంటిని సురక్షితంగా హనుమకొండలోని జూ పార్క్‌కు తరలించారు. స్థానికుల రాకతో మరో రెండు గుట్టల్లోకి వెళ్లాయి. స్థానికులు, వరంగల్‌ డివిజన్‌ ఎఫ్‌ఆర్వో సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. ఓ రైతు వ్యవసాయక్షేత్రం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గతంలో వేట కోసం ఉచ్చులు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పొలంలో పనిచేస్తున్న వారికి ఒక తల్లి ఎలుగుబంటి, రెండు పిల్ల ఎలుగుబంట్లు కనిపించాయి. ఆడ ఎలుగుబంటి పిల్ల ఉచ్చులో చిక్కుకోగా తల్లి, మరో పిల్ల దానిని రక్షించేందుకు చూస్తున్నాయి. గ్రామస్థుల సమాచారంతో వరంగల్‌ డివిజన్‌, స్టేషన్‌ఘనపూర్‌ ఎఫ్‌ఆర్వోలు సదానందం, మురళీధర్‌, హనుమకొండ జూపార్క్‌ ఇన్‌ఛార్జి రాజుగౌడ్‌, పశువుల మత్తు వైద్యుడు ప్రవీణ్‌ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొన్నారు. స్థానికుల పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తల్లి ఎలుగుబంటి, మరో పిల్ల సమీపంలోని గుట్టల్లోకి వెళ్లాయి. సుమారు రెండున్నర గంటల శ్రమించిన తర్వాత ఉచ్చులో చిక్కుకున్న ఏడాదిన్నర వయసు ఉన్న ఆడ ఎలుగుబంటికి మత్తు ఇచ్చి బోనులో సురక్షితంగా జూపార్క్‌కు తరలించారు. అక్కడ వారం రోజులు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత అడవిలో విడిచి పెట్టనున్నట్లు ఎఫ్‌ఆర్వో సదానందం తెలిపారు. వారం రోజుల్లో మిగిలిన తల్లి, బిడ్డ ఎలుగుబంట్లను పట్టుకుంటామని తెలిపారు. పిల్ల ఎలుగుబంటి దూరం కావడంతో తల్లి ఎలుగుబంటి ఆవేశంతో ఉంటుందని సమీప పాత్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రాంతం వైపు రావద్దని సూచించారు. అటవీశాఖ సిబ్బంది నర్సింగ్‌, రవి, అనిల్‌, రాజు, మోహన్‌, సురేశ్‌, ఉప్పల్లయ్య, సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని