logo

‘అధికారం ఉందని అహంకారం వద్దు’

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అహంకారంతో ఉంటే భవిష్యత్తులో పాలనాపరంగా ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి హెచ్చరించారు.

Published : 05 Dec 2023 03:14 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అహంకారంతో ఉంటే భవిష్యత్తులో పాలనాపరంగా ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యేగా గెలుపొందిన కడియం శ్రీహరి హెచ్చరించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ అయిదేళ్లు పూర్తిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని ఆగం చేయవద్దని హితవు పలికారు. హస్తం పార్టీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, రాష్ట్ర ఆదాయం ఏడాదికి రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని, కానీ వారి హామీలకు దాదాపు రూ.5 లక్షల కోట్లు వెచ్చించాలని, పథకాలు అమలు చేయడం కష్టమన్నారు. గ్రూపు తగాదాలకు స్వస్తి పలికి, అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు.  భారాస నాయకులే పలు చోట్ల తనకు వెన్నుపోటు పొడిచారని, త్వరలోనే గ్రామాల్లో విశ్లేషణ చేసి ఆ నివేదికను పార్టీకి అందజేస్తానన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌ రెడ్డి, మండలాధ్యక్షుడు మాచర్ల గణేష్‌, నాయకులు రాకేష్‌ రెడ్డి, వెంకటేష్‌, వెంకన్న, నరేందర్‌ రెడ్డి, సర్పంచ్‌లు సురేష్‌, సారంగపాణి, యాదగిరి, రాజు, రవి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని