logo

రుద్రమలై కదలాలి.. ఓరుగల్లు మురవాలి

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు చోటు లభించింది. ములుగు, వరంగల్‌ తూర్పు స్థానాల నుంచి విజయం సాధించిన దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Updated : 08 Dec 2023 10:25 IST

సీతక్క, సురేఖలపై ఉమ్మడి జిల్లావాసుల ఆశలు
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, రంగంపేట, న్యూస్‌టుడే

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు చోటు లభించింది. ములుగు, వరంగల్‌ తూర్పు స్థానాల నుంచి విజయం సాధించిన దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఓరుగల్లు రుద్రమలై ఉమ్మడి వరంగల్‌ను ప్రగతి బాటలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు.


తొలి సవాలు మేడారం జాతర

ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ సీతక్కకు తన సామర్థ్యం నిరూపించుకోవడానికి మేడారం జాతర రూపంలో మంచి అవకాశం వచ్చింది. తన సొంత నియోజకవర్గంలో జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క సారలమ్మ మహాజాతరను విజయవంతం చేయడం ద్వారా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. ఇప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. వెంటనే భారీగా నిధులు కేటాయించి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి.

పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి. బొగత, రామప్ప, లక్నవరం, వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌, పాకాల సరస్సు, పాండవుల గుట్టలు ఇలా ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటిలో సౌకర్యాలు కల్పించి ఓరుగల్లును పర్యాటక స్వర్గధామంగా తీర్చిదిద్దాలి.

దేవాదుల ఆశలన్నీ మీపైనే..

ఉమ్మడి వరంగల్‌తో పాటు, ఉమ్మడి నల్గొండ, మెదక్‌ జిల్లాలకు దాదాపు 6 లక్షల ఎకరాల సాగునీరే లక్ష్యంగా దేవాదుల ప్రాజెక్టును నిర్మించారు. మూడో దశలో నిర్మిస్తున్న సొరంగం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర కాల్వలు, పైప్‌లైన్‌ నిర్మాణాల్లో ఇప్పటికీ జాప్యం అవుతోంది. అంచనా వ్యయం రూ.5 వేల కోట్లతో మొదలై ఇప్పుడు రూ.17 వేల కోట్లకు పెరిగింది. నేటికీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. నిధులు కేటాయించి, పనులు వేగవంతం చేసి రైతులకు సాగినీటిని అందించాలి.


గ్రేటర్‌ సమస్యలు తీరాలి

వరంగల్‌ మహా నగరాన్ని అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ముంపు బెడద 15 ఏళ్లుగా ఉంది.  వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు మంత్రి పదవి దక్కడంతో వరంగల్‌ నగరాభివృద్ధిపై ఆశలు చిగురించాయి. 2009లోనూ  వైఎస్‌ఆర్‌ హయాంలో మహిళా శిశు సంక్షేమం, బధిరుల సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈసారి వరంగల్‌, వరంగల్‌ పశ్చిమతో పాటు వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మంత్రులూ వీటిపై దృష్టి పెట్టరూ..

  • యునెస్కో గుర్తింపు దక్కిన రామప్పను అభివృద్ధి చేయాలి. కేంద్రం ‘ప్రసాద్‌’  పథకంలో చేర్చినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేయాలి.
  • వరంగల్‌ స్మార్ట్‌ సిటీ పనులు పూర్తిచేయాలి. ఎంజీఎంలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలి.
  • వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండల పరిధిలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ(టైక్స్‌టైల్‌ పార్కు)ను అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు 60 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కేంద్రం కూడా మిత్ర పథకంలో చేరుస్తామని ప్రకటించింది.
  • భూపాలపల్లికి ఎస్సారెస్పీ, దేవాదుల నుంచి సాగునీటి పంపిణీని మెరుగుపర్చాలి. చిన్నకాళేశ్వరం పూర్తిచేయాలి.
  • ములుగు జిల్లాలో ములుగు, ఏటూరునాగారంలో బస్సు డిపోల ఏర్పాటు. గోదావరి తీర ప్రాంతాల్లో ముంపు నివారణ చర్యల కోసం కరకట్టల నిర్మాణం చేపట్టాలి
  • చేర్యాల రెవెన్యూ డివిజన్‌, జనగామ పట్టణంలో మౌలిక సదుపాయాలు, రంగప్ప చెరువు సుందరీకరణ, తాగునీటి సరఫరా చేయాలి. పీజీ కళాశాలకు సొంత భవనం నిర్మాణం చేయాలి.
  • వర్ధన్నపేట నియోజకవర్గం మడికొండలో డంపింగ్‌ యార్డు సమస్య, ఐనవోలు మండలంలో ల్యాండ్‌పూలింగ్‌ సమస్య పరిష్కరించాలి. మామునూరు ఎయిర్‌ పోర్టు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలి.  
  • మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో వంద పడకల ఆసుపత్రి అవసరం.  నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగా ఏర్పడిన దంతాలపల్లి, సీరోల్‌ మండలాలకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి.

మంత్రులుగా మనోళ్లు..!

నాటి ఆంధ్రప్రదేశ్‌.. నేటి తెలంగాణ ఎప్పుడైనా వరంగల్‌ జిల్లాది ప్రత్యేక స్థానం. ప్రతి ప్రభుత్వంలో కీలక శాఖలు ఇక్కడివారిని వరించాయి. ఉప ముఖ్యమంత్రి స్థాయి నుంచి వివిధశాఖల మంత్రులుగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి ఇప్పటి వరకు 23 మంది మంత్రి పదవుల్ని చేపట్టారు.  ఈసారి కొత్తగా సీతక్క ఆ జాబితాలో చేరారు.  ఇప్పటి వరకు ఎవరెవరు ఏ శాఖ మంత్రిగా పనిచేశారనే వివరాలతో ప్రత్యేక కథనం..

ఈనాడు, మహబూబాబాద్‌

కడియం శ్రీహరి: స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున 1994, 1999లో గెలిచారు. ఆ సమయంలో ఏర్పడిన తెదేపా ప్రభుత్వంలో మార్కెటింగ్‌ గిడ్డంగులు, సాంఘిక సంక్షేమ, విద్యా, భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

దాస్యం ప్రణయ్‌భాస్కర్‌: హనుమకొండ నుంచి 1994లో తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వ మంత్రి మండలిలో యువజన, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

బొచ్చు సమ్మయ్య: పరకాల నుంచి కాంగ్రెస్‌ (ఐ) తరఫున ఎన్నికై 1978లో మర్రిచెన్నారెడ్డి, 1982లో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రిగా వ్యవహరించారు.

తక్కళ్లపల్లి పురుషోత్తమరావు: 1989లో వరంగల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచి ఆర్‌అండ్‌బీశాఖ మంత్రిగా పనిచేశారు.

పొన్నాల లక్ష్మయ్య: జనగామ నియోజకవర్గం నుంచి 1989లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రి వర్గంలో మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్‌ఆర్‌ హయాంలో భారీ, మధ్య తరహా నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014 వరకు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో దేవాదాయ, ఐటీ, కమ్యూనికేషన్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

డీఎస్‌ రెడ్యానాయక్‌: డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి గెలిచి 2004లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు.

బస్వరాజు సారయ్య: 2009లో వరంగల్‌ తూర్పు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు.

టి.హయగ్రీవచారి:  1957, 1962లో ధర్మసాగర్‌ నియోజకవర్గం నుంచి, 1972లో స్టేషన్‌ఘన్‌పూర్‌ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ మంత్రి మండలిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు. 1980లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా,  1982లో సాంకేతిక విద్యాశాఖ, దేశీయ వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు.

అజ్మీర చందులాల్‌:  1985, 1994, 2014లో ములుగు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1989లో ఎన్నికలకు ఆరు నెలల ముందు  తెదేపా ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో భారాస ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ, పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

పింగిలి ధర్మారెడ్డి: పరకాల నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్‌ తరఫున గెలిచి జలగం వెంగళ్‌రావు మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

సంగమరెడ్డి సత్యనారాయణ: హనుమకొండ నుంచి 1983లో తెదేపా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.

రామస్వామి: గోక రామస్వామి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1978, 1983లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1978 నుంచి 1979 వరకు మర్రి చెన్నారెడ్డి కేబినెట్‌లో ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా, టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో 1980 నుంచి 1982 వరకు రవాణా, మత్స్య, ఉద్యానవన అభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు.

మాదాడి నర్సింహారెడ్డి: 1985, 1989లో శాయంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా గెలిచారు. 1989లో మున్సిపల్‌శాఖ మంత్రిగా పనిచేశారు.

పోరిక జగన్‌నాయక్‌: ములుగు ఎస్టీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా పోరిక జగన్‌నాయక్‌ 1978లో విజయం సాధించారు. 1983, 1989లో మరోసారి కాంగ్రెస్‌ శాసనసభ్యుడిగా విజయం సాధించి ఉద్యాన, పశుసంవర్ధకశాక మంత్రిగా పనిచేశారు.

ఎన్‌. యతిరాజారావు: ఇప్పటి పాలకుర్తి నియోజకవర్గంలోని చెన్నూరు 2009 వరకు నియోజకవర్గంగా కొనసాగింది. చెన్నూరు నుంచి తెదేపా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994లో ఆర్‌అండ్‌బీ, దేవాదాయ, సహకారశాఖ మంత్రిగా పనిచేశారు.

పీవీ రంగారావు : 1989లో హనుమకొండ  నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1992లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

నూకల రాంచంద్రారెడ్డి: డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున నాలుగు సార్లు విజయం సాధించారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1960లో ఆహార, వ్యవసాయం, కార్మికశాఖ మంత్రిగా, 1962లో, 1964-1967 వరకు రెవెన్యూ, భూ సంస్కరణల శాఖ మంత్రిగా, 1973-74 వరకు ఆర్థిక, వాణిజ్య పన్నులశాఖ మంత్రిగా పనిచేశారు.

తాటికొండ రాజయ్య:  2014లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి భారాస తరఫున గెలిచి కేసీఆర్‌ సర్కారులో ఉపముఖ్యమంత్రిగా, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.

గుండె విజయరామారావు: స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి 2004లో భారాస శాసనసభ్యుడిగా విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్‌, భారాస పొత్తులో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వ మంత్రి మండలిలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు.

నిమ్మ రాజిరెడ్డి: చేర్యాల నియోజకవర్గం నుంచి 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985, 1989, 1994లో తెదేపా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో విద్యుత్తుశాఖ మంత్రిగా పనిచేశారు.

ఎర్రబెల్లి దయాకర్‌రావు:  2018లో పాలకుర్తి నుంచి భారాస తరఫున విజయం సాధించి   కేసీఆర్‌ మంత్రి వర్గంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

సత్యవతిరాథోడ్‌:  2019లో ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంతరం కేసీఆర్‌ మంత్రి వర్గంలో గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని