logo

అవినీతి అధికారులకు తప్పదు శిక్ష!

సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లొసుగుల ఆధారంగా ఏడాదిన్నరగా రూ.కోటిన్నర దోచుకున్న పోస్టుమాస్టర్‌ అవినీతి బాగోతానికి రెండేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెరదించడం ఉమ్మడి జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Published : 01 Mar 2024 02:56 IST

దోచుకొన్న సొమ్ముకు రెండింతలు సమర్పించిన పోస్టు మాస్టరు

కొడకండ్ల, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లొసుగుల ఆధారంగా ఏడాదిన్నరగా రూ.కోటిన్నర దోచుకున్న పోస్టుమాస్టర్‌ అవినీతి బాగోతానికి రెండేళ్ల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెరదించడం ఉమ్మడి జిల్లా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. హనుమకొండకు చెందిన కేసరి సతీష్‌ అనే పోస్టుమాస్టర్‌ అక్కడి ప్రధాన తపాలా కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ 2020 సెప్టెంబరులో కొడకండ్ల పోస్టుమాస్టరుగా బదిలీపై వచ్చారు. అప్పటికే ప్రధాన కార్యాలయం కంప్యూటర్లలో తపాలా శాఖ పద్దులన్నింటిపై అవగాహన ఏర్పర్చుకొని కొడకండ్ల కేంద్రంగా అవినీతికి తెరలేపారు. వరంగల్‌, భువనగిరి తపాలా కార్యాలయాల్లో మాత్రమే రైల్వే టికెట్‌ రిజర్వేషన్లు, ఉపసంహరణలు చేసుకొనే సదుపాయాన్ని కల్పించి సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక పద్దులు కేటాయించడాన్ని గమనించిన సతీష్‌ ఆరు మాసాల కాలం ఆ పద్దుల నుంచి డబ్బులు తీసుకోవడం, తిరిగి జమచేస్తూ రెక్కీ నిర్వహించారు. లావాదేవీలు జరగని ఆదివారాల్లో మాత్రమే ఆ పద్దుల నుంచి డబ్బులు తీసుకొంటుండటంతో ఉన్నతాధికారులు గుర్తించలేకపోయారు. సతీష్‌ తన బ్యాంకు ఖాతాతో పాటు స్నేహితులు, బంధువుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేవారు. క్రమంగా జల్సాలకు, జూదానికి పాల్పడుతూ వచ్చారు. ప్రజలకు చెల్లించే వివిధ రకాల పద్దుల సొమ్ము యథావిధిగా ఉండటంతో అధికారులు సైతం అనుమానించలేక పోయారు. ఏప్రిల్‌ 2022లో ఆయన వారం రోజులు సెలవు పెట్టడంతో కేంద్ర కార్యాలయానికి సంబంధించిన మరో ఉద్యోగిని పోస్టుమాస్టర్‌గా కొడకండ్లకు పంపడంతో లెక్కలు సరిచూస్తుండగా రూ.4.50 లక్షల తేడా కన్పించడంతో సతీష్‌ను ప్రశ్నించారు. డబ్బులు తనవద్దనే ఉన్నట్లు చెప్పి అనుకోకుండా రైల్వే పద్దులో నమోదు చేసినట్లు వివరించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. కేంద్ర కార్యాలయంలో పూర్తి వివరాలను గమనించగా కొడకండ్ల తపాలాశాఖ కార్యాలయం నుంచి ఆదివారాల్లో లక్షల రూపాయలు ఇతర ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. 2023 మే 21న తపాలాశాఖ ఉన్నతాధికారులు, పలువురు సిబ్బంది ఆకస్మికంగా తనిఖీ చేసి సతీష్‌ సమక్షంలోనే రాత్రి ఒంటిగంట వరకు విచారణ చేపట్టి చివరకు అవినీతికి పాల్పడ్డట్టు నిర్ధారించి తక్షణం విధుల నుంచి తొలగించారు. ఏడాదిన్నరగా అతనికి సహకరించిన సుమారు 20 మంది తపాలా అధికారులు, సిబ్బంది నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేశారు. అరెస్ట్‌ చేసిన అనంతరం సతీష్‌ అందించిన వివరాలతో పూర్తి స్థాయి సాక్ష్యాలు సేకరించిన ఈడీ అతని ఆధీనంలో ఉన్న రూ.3.26 కోట్ల విలువ గల ఆస్తులను రెండు రోజుల క్రితం స్వాధీనం చేసుకొని భారీ అవినీతికి తెరదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని