logo

రూ.30కే సికింద్రాబాద్‌ వరకు..

పేద ప్రయాణికుల ప్యాసింజరు రైళ్లు తిరిగి వచ్చాయి. కొవిడ్‌-19  తర్వాత రైల్వే శాఖలో అనేక మార్పులు వచ్చాయి.

Published : 01 Mar 2024 02:57 IST

మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్‌ రైళ్లు

కాజీపేట, న్యూస్‌టుడే: పేద ప్రయాణికుల ప్యాసింజరు రైళ్లు తిరిగి వచ్చాయి. కొవిడ్‌-19  తర్వాత రైల్వే శాఖలో అనేక మార్పులు వచ్చాయి. పేద ప్రజలు చౌకగా ప్రయాణం చేసే ప్యాసింజరు రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి ఎక్కువ ఛార్జీ వసూలు చేశారు. చిన్న రైల్వే స్టేషన్లను కూడా ఎత్తి వేశారు. దీంతో గత నాలుగేళ్లుగా ప్రయాణికులు రైలు ప్రయాణంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు పాలకులు ప్యాసింజరు రైళ్లను యథావిధిగా నడిపిస్తూ.. పాత ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. దీంతో కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు పుష్‌పుల్‌ ప్యాసింజరు రైలులో కేవలం రూ.30లకే ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. కొవిడ్‌ తరవాత మొన్నటి వరకు దానికి ఎక్స్‌ప్రెస్‌ ఛార్జి రూ.60 ఉండేది. ఫిబ్రవరి 27 నుంచి ఛార్జి రూ.30 తీసుకుంటున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాజీపేట రైల్వే కమర్షియల్‌ మేనేజర్‌ సజ్జన్‌లాల్‌ సూచించారు.

పెరుగుతున్న ఆదరణ..: రైల్వేశాఖ ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించడంతో వాటిలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ, సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌కు ప్యాసింజరు రైళ్లలో  కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కాజీపేట నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌కు ఇది వరకు ఎక్స్‌ప్రెస్‌ ఛార్జి రూ.80 ఉండేది. ఇప్పుడు కేవలం రూ. 35లకే వెళ్లే అవకాశం ఉంది. భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్‌కు కేవలం రూ.30లతో సింగరేణి ప్యాసింజర్‌లో ప్రయాణం చేయొచ్చు. ఇందులో ఇది వరకు టికెట్‌ ధర రూ.75 ఉండేది. ముఖ్యంగా కూరగాయలు, పాల వ్యాపారులు,  హైదరాబాద్‌లోని మాల్స్‌లో పనిచేసే కార్మికులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు.

కాజీపేట వరకు భాగ్యనగర్‌...

సికింద్రాబాదు నుంచి కాగజ్‌నగర్‌ వెళ్లే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌.. కాజీపేట- కాగజ్‌నగర్‌ల మధ]్య ప్యాసింజర్‌గా నడుస్తుంది. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ మధ్య మాత్రం ఎక్స్‌ప్రెస్‌గా ఉంటుంది.

కనిష్ఠ ఛార్జి రూ.5..

ప్యాసింజరు రైలులో కనిష్ఠ ఛార్జి రూ.5 ఉంటుంది. ఒకటి నుంచి మూడు రైల్వే స్టేషన్ల వరకు ఇదే ఛార్జితో ప్రయాణం చేయవచ్చు. కాజీపేట నుంచి జమ్మికుంటకు కేవలం రూ. 10లకే వెళ్లొచ్చు. ఇదే బస్సులో ప్రయాణం అయితే రూ.120 అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని