logo

మేడారం మెరవాలి.. భక్తులు మురవాలి

మేడారం మహాజాతర ముగిసింది. ఈసారి జాతర నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి.

Published : 01 Mar 2024 02:59 IST

మేడారం మహాజాతర ముగిసింది. ఈసారి జాతర నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతరకు తక్కువ సమయం ఉన్నా.. రూ.75 కోట్లు ఒకసారి, రూ.35 కోట్లు మరోసారి మంజూరు చేసి ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చేపట్టారు. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం, కొత్త అధికారులు విధుల్లో ఉండటం, నిర్వహణలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకావడంతో.. భక్తులు అసంతృప్తికి లోనయ్యారు. మహా జాతరలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తామని, వచ్చే మినీ జాతర నాటికి ఇబ్బందులు తొలగిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ ప్రయత్నాన్ని ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లి అమలు చేస్తే వచ్చే జాతరను  పకడ్బందీగా నిర్వహించే అవకాశం ఉంటుంది.

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

సమావేశం కీలకం

జాతర తిరుగువారం అనంతరం ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పూజారులు, తదితర నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగిన లోపాలు, వాటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చేపట్టాల్సిన విధివిధానాలేంటి? బడ్జెట్, తదితర అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. త్వరగా సమావేశం నిర్వహిస్తే జాప్యం కాకుండా అభివృద్ధికి అడుగులు పడేందుకు వీలుంటుంది.  

మేడారం జాతరలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తే ఇలాంటి అవస్థలు తప్పుతాయి.

ప్రత్యేక అథారిటీ అవసరం

జాతర నిర్వహణ, శాశ్వత పనులు, మేడారం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఉండాలని మంత్రి సూచించారు. ఈ ప్రత్యేక అథారిటీ మేడారం జాతర అభివృద్ధికి కృషి చేస్తుంటుంది. ఇందులో జిల్లా కలెక్టర్‌, వివిధ శాఖల అధికారులు, పూజారులు, నిపుణులు  ఉండే అవకాశం ఉంది. దీని ఏర్పాటుతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుని పనుల ప్రగతిపై సమీక్షిస్తారు. పర్యవేక్షణ ఉంటుంది. ప్రభుత్వ అనుమతితో దీనిని ఏర్పాటు చేస్తారు.

జాతరకు వస్తున్న వాహనాలివి. ప్రధాన రహదారులను నాలుగు వరుసలుగా విస్తరిస్తే ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించవచ్చు.

మాస్టర్‌ ప్లాన్‌ తప్పనిసరి

జాతరలో ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యాయి. భక్తుల రద్దీతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఏదో సమస్య తలెత్తుతూనే ఉంది. ముందస్తుగా ఓ ప్రత్యేక సర్వే చేపట్టి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయిస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. దీనిద్వారా మెరుగైన వసతులు కల్పించే అవకాశం ఉంటుంది.

శాశ్వత పనులపైనే దృష్టి

మరుగుదొడ్లు, తాగునీరు, క్యూలైన్లు, కాటేజీలు, విడిది కేంద్రాలు, షవర్లు, ఇతరాత్ర శాశ్వత పనులపైనే దృష్టి పెట్టాలి. సులువుగా దర్శనం చేసుకునే విధంగా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించాలి. అమ్మవార్ల గద్దెలకు కానుకలు చేరే విధంగా, గద్దెల నుంచి భక్తులకు ప్రసాదంగా బంగారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్‌ నియంత్రణ, ప్రధాన రహదారుల విస్తరణ, వచ్చిన దారినే వెళ్లేలా అన్ని మార్గాలను నాలుగు వరుసలుగా చేపట్టాలి.

2018 జాతరలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.200 కోట్లు ప్రకటించారు. అవి మంజూరు కాలేదు. ప్రతిపాదనలు సిద్ధం చేసినా ముందుకు కదల్లేదు. ఈసారైనా అడుగులు పడాలి. భవిష్యత్తులో ఈ మహా ఉత్సవం సాఫీగా జరగాలి.  

‘ఏమైనా లోపాలుంటే వచ్చే చిన్న(మినీ) జాతర కల్లా సరిదిద్దుకుంటాం. త్వరలో అధికారులు, పూజారులతో సమీక్షించి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తాం. అందరి సూచనలు, సలహాలు స్వీకరించి ఈ ప్రాంత బిడ్డగా వచ్చే జాతరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం. క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర శాశ్వత ఏర్పాట్లు చేస్తాం. జాతర సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధికి కృషి చేస్తాం’

జాతర ముగింపు రోజున పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని