logo

నాలుగింతల ఆనందం!

పుట్టిన రోజు, పెళ్లి దినోత్సవం... ఏడాదికోసారి వస్తేనే ఎవరికైనా మధురానుభూతి. అలాంటిది లీపు సంవత్సరంలో పుడితే, ఒకటైతే... ఈ తరహా వేడుకకు నాలుగేళ్లు నిరీక్షించాలి.

Published : 01 Mar 2024 03:02 IST

పుట్టిన రోజు, పెళ్లి దినోత్సవం... ఏడాదికోసారి వస్తేనే ఎవరికైనా మధురానుభూతి. అలాంటిది లీపు సంవత్సరంలో పుడితే, ఒకటైతే... ఈ తరహా వేడుకకు నాలుగేళ్లు నిరీక్షించాలి. నిజంగా ఆ రోజు కళ్లెదుటకు వస్తే... నాలుగింతల ఆనందం నెలకొంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు గురువారం (ఫిబ్రవరి 29) ఆస్వాదించారు.

డోర్నకల్‌, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే


ఘనంగా వేడుకలు

డోర్నకల్‌కు చెందిన శాలిని 2004, ఫిబ్రవరి 29న జన్మించింది. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే పుట్టిన రోజును గురువారం తల్లి శ్రీలత పని చేసే కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు.


నియామకం సంబురం

డోర్నకల్‌లోని ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రభుదాస్‌ 2008, ఫిబ్రవరి 29న ఉద్యోగంలో చేరారు. తోటి ఉపాధ్యాయులు ఏటా ఉద్యోగ నియామక వార్షికోత్సవం చేసుకుంటుంటారు. ఆయన మాత్రం 16 ఏళ్ల సర్వీస్‌లో కేవలం నాలుగు సార్లు దీనికి అర్హుడయ్యారు.. లీపు ఏడాది ఉద్యోగం రావడమే దీనికి కారణం. ప్రత్యేకమైన ఈ తేదీని గుర్తు పెట్టుకుని గురువారం ప్రధానోపాధ్యాయుడు వెంకట్రావు, ఉపాధ్యాయులు గౌసీయా బేగం, జాస్మిన్‌, ఐఈఆర్‌పీ ప్రతాప్‌ ఆయన్ను పూలమాలతో విద్యార్థుల సమక్షంలో సత్కరించారు.


ఒక్కటైన జంటలు

వర్ధన్నపేటలోని ఓ వేడుకల మందిరంలో జరుగుతున్న పెళ్లి

గతాన్ని భిన్నంగా గురువారం వచ్చిన లీపు రోజు మాత్రం ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది శుభకార్యాలు జరిగాయి. వర్ధన్నపేటలోని అన్ని వేడుకల మందిరాల్లో లీపు సంవత్సరం రోజు పదుల సంఖ్యలో కొత్త జంటలు ఒక్కటయ్యాయి.తమ పెళ్లిరోజు నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరం రోజు రావడం ఆనందంగా ఉందని పలు కొత్త జంటలు సంతోషం వ్యక్తం చేశాయి.

వర్ధన్నపేట, న్యూస్‌టుడే


పుట్టిన రోజు ప్రత్యేకం..

ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 29న జన్మించిన పిల్లలు చాలా స్పెషల్‌గా ఉంటారని చెబుతారు. ఎందుకంటే వీరు నాలుగేళ్లకు ఒకసారి పుట్టిన రోజు జరుపుకొంటారు. గురువారం లీపు డే రోజున ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతైన గర్భిణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబంలో ఒక ప్రత్యేకతను చాటేలా ఈరోజున తమ ఇంట్లోకి బిడ్డ రావడం కలిసి వచ్చినట్లుగా అనుకుంటున్నారు.

మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లుగా ఉంది

మాది హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ మండలం నీరుకుళ్ల గ్రామం. నాకు మొదటి కాన్పులో అబ్బాయి పుట్టాడు. మూడేళ్ల తర్వాత గర్భంతో ప్రసూతి కోసం ఫిబ్రవరి 28న సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాను. నొప్పులు రావడంతో ఈరోజు ఉదయం వైద్యులు ప్రసూతి చేశారు. అమ్మాయి పుట్టింది. ఈరోజు లీప్‌ డే ప్రత్యేకమైన రోజున అమ్మాయి పుట్టడం మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చినంత ఆనందం ఉంది.

బాబు పుట్టడం సంతోషంగా ఉంది

మాది వరంగల్‌ జిల్లా సంగెం మండలం షాపురం గ్రామం. వ్యవసాయ కుటుంబం. నాకు మొదట అమ్మాయి పుట్టింది. రెండో కాన్పు కోసం వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో చేరాను. నొప్పులు రావడంతో ఈరోజు శస్త్రచికిత్స ద్వారా వైద్యులు ప్రసూతి చేయగా అబ్బాయి పుట్టాడు. లీప్‌ డే రోజు అని తెలిసి ఆశ్చర్య పోయా. నాలుగేళ్లకోసారి పుట్టినరోజు జరుపుకోవాల్సి వస్తుందని అన్నారు. ఏమైనా ఒక ప్రత్యేకత గల రోజున బాబు పుట్టడం నాకు మంచిదనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని