logo

బంధాలను తట్టిలేపే సంధ్య కథలు

సందేశాత్మక కథలకు పాఠకాదరణ ఎప్పుడూ తగ్గదని నిరూపిస్తున్నాయి సంధ్య అడుపు రచనలు. 

Updated : 01 Mar 2024 06:35 IST

మహిళా దినోత్సవం ప్రత్యేకం
దేశవిదేశాల్లోని తెలుగువారి ఆదరణ

సందేశాత్మక కథలకు పాఠకాదరణ ఎప్పుడూ తగ్గదని నిరూపిస్తున్నాయి సంధ్య అడుపు రచనలు.  మానవ సంబంధాలను తట్టిలేపేలా భిన్న నేపథ్యాలతో రాస్తూ వాటిని అంతర్జాలంలో అందుబాటులో పెట్టడంతో లక్షలాది మంది పాఠకులు ఆన్‌లైన్‌లో చదివేస్తూ కథల్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.  

ఈనాడు, వరంగల్‌

మంచుకొండల్లో రాస్తూ

సంధ్య స్వస్థలం హనుమకొండ బ్యాంకుకాలనీ. భర్త సునీల్‌ అడుపు లైబ్రేరియన్‌. ఉద్యోగారీత్యా వీరు ఆరేళ్ల కిందట ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్లి స్థిరపడ్డారు. హిమాలయపర్వతాల మధ్య ప్రకృతి ఒడిలో నివాసం ఉంటున్నారు. చక్కని వాతావరణం. ఎటు చూసినా మంచు కొండలే. ఈ ప్రకృతి అందాలను చూస్తూ సంధ్య కలం కదిలించడం మొదలుపెట్టారు. తన చిన్నతనంలో జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాలలో అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి చదువుకునేటప్పుడు చిన్న చిన్న కవితలు రాసే అలవాటు ఉండేదట. అలా తన చిన్న తనంలో ఉన్న రచనా నైపుణ్యానికి కాస్త పదును పెట్టి మంచు కొండల మధ్య చక్కని కథలు రాయడం మొదలుపెట్టారు.

ఆన్‌లైన్‌లో లక్షలాది అభిమానులు

రోజుకో మంచి కథ రాస్తూ ‘తెలుగు స్టోరీ ఎక్స్‌ప్రెస్‌’ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించారు. ఇవన్నీ మానవ సంబంధాలు, నైతిక విలువలతో కూడుకొని ఉంటాయి. నేటి తరంలో వృద్ధులను కొందరు పిల్లలు ఆదరించకుండా ఉండడం వల్ల వారు ఎంతటి మానసిక వేధనకు గురవుతున్నారనే కోణంలో హృదయాలను కదిలించే విధంగా రాస్తున్నారు. వీటిని లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆదరిస్తున్నారు. ఆమె ఛానెల్‌కు వేల సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు అయ్యారు. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్‌, కెనడా తదితర దేశాల్లో తెలుగువాళ్లు సంధ్య కథలు వినడానికి ఆసక్తి చూపుతున్నారు. అలా ఇప్పటికి అంతర్జాలంలో ఈమె రాసిన కథల్ని 40 లక్షల మందికిపైగా చదివారంటే ఈ కథల్లో దాగున్న సందేశాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హాయిగా వినొచ్చు

సంధ్య రాసిన కథలకు మరో ప్రత్యేకత ఉంది. ఎక్కువ సేపు చరవాణి తెరను చూస్తే కళ్లకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే కథల్ని హాయిగా వినేయొచ్చు. ఛానెల్‌లోకి వెళ్లగానే కథ స్క్రిప్ట్‌తోపాటు సంధ్య స్వయంగా తన గొంతుతోనే కథను చక్కగా చెబుతూ ఆడియో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

గొప్ప సందేశం..

వసంత, రాము దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. వీళ్లింట్లో లక్ష్మి అనే పనిమనిషి ఉంటుంది. ఆమె భర్త ఆటో డ్రైవర్‌. వీరికి అమృత అనే పాప ఉంటుంది. లక్ష్మి తనతో పాటు కూతురు అమృతను పనికి తీసుకొస్తుంటుంది. వసంత పిల్లల్ని ఆడిస్తుంటుంది అమృత. రోడ్డు ప్రమాదంలో అమృత తల్లిదండ్రులిద్దరూ తీవ్ర గాయాలై కన్నుమూస్తారు. అనాథ అయిన అమృతను పెంచుకుందామని వసంత అనుకుంటుంది. అందుకు భర్త రాము నిరాకరిస్తాడు. దీంతో అమృతను హాస్టల్‌లో వేసి వేరే ఊరికి బదిలీపై వెళ్లిపోతారు. ఓ పాతికేళ్ల తర్వాత.. వసంత ఓసారి దుకాణానికి వెళ్లినప్పుడు ‘ఆంటీ బావున్నారా’ అంటూ అమృత పలకరిస్తుంది. ఆమెను చూసి వసంత ఎంతో సంతోషించి ఇంటికి తీసుకెళుతుంది. పిల్లలు ఎక్కడ ఆంటీ? అని అమృత అడుగుతుంది. మంచి చదువులు చదివించాం. పెళ్లిళ్లు అయ్యాయి. విదేశాల్లో స్థిరపడ్డారు. తాము ఒంటరిగా మిగిలామని ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతారు. అప్పుడు అమృత కలగజేసుకొని ఆంటీ చిన్నప్పుడు నాకు ఎంతో చేశారు? నన్ను హాస్టల్‌లో వేశారు. బాగా చదివి ఇప్పుడు లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించా. నాకూ ఎవరున్నారు? అంకుల్‌, మీరు నాతో ఉండిపోండి అంటూ కన్నకూతురిలా తన ఇంటికి వారిని ఆహ్వానిస్తుంది. రాము ముఖంలో తీవ్ర పశ్చాత్తాపం. అనాథగా ఉన్న అమ్మాయిని ఆదరిద్దామంటే వద్దన్నా. కోటి ఆశలు పెట్టుకున్న కొడుకులు వదిలేసి వెళ్లారు. ఎప్పుడో చేసిన చిన్న సాయం గుర్తుంచుకొని అమృత తమను ఆదరిస్తోంది. అంటూ ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతారు.  

వింటూ నిద్రపోతామని చెబుతారు
సంధ్య అడుపు, రచయిత్రి

సమాజంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇతి వృత్తాలనే కథాంశాలుగా తీసుకొని రాస్తున్నా. ప్రతి రోజూ ఒక్కటైనా అప్‌లోడ్‌ చేస్తా. నా కథలు వింటూ నిద్రపోతామని అభిమానులు కామెంట్లు పెట్టడం చాలా సంతోషాన్నిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు